KXIP vs RCB: నలుగురు ఆటగాళ్లు కొత్త మైలురాళ్లను చేరుకునే అవకాశం!

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 11:56 AM

KXIP vs RCB: నలుగురు ఆటగాళ్లు కొత్త మైలురాళ్లను చేరుకునే అవకాశం!

ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో.. ఈ మ్యాచ్‌‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లూ ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే కసితో బెంగళూరు, పంజాబ్ బరిలో దిగాయి. తొలి మ్యాచ్‌లో బౌలర్లు పుంజుకోవడంతో సన్‌రైజర్స్‌పై గెలిచిన ఉత్సాహంలో బెంగళూరు ఉంది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, డివిలియర్స్, గేల్, కేల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు తలపడబోతున్నారు. ఇరు జట్లూ గెలుపే లక్ష్యంగా ఆడబోతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్, రాహుల్ అరుదైన మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం..

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో 74 రన్స్ చేస్తే ఐపీఎల్‌లో 5500 పరుగులు పూర్తి చేసుకుంటాడు. టీ20ల్లో 9 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గానూ విరాట్ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ కలుపుకొని ఇప్పటి వరకూ కోహ్లి టీ20ల్లో 8914 రన్స్ చేశాడు. ఇప్పటి వరకూ ముగ్గురు క్రికెటర్లు మాత్రమే టీ20ల్లో 9 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నారు.

కోహ్లి పార్టనర్ ఏబీ డివిలియర్స్ ఒక్క సిక్స్ కొడితే చాలు టీ20ల్లో 400 సిక్సుల క్లబ్‌లో చేరతాడు. ఈ మార్క్ చేరుకోబోయే తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఏబీ 53 రన్స్ చేస్తే ఐపీఎల్‌లో 4500 రన్స్ పూర్తి చేసుకుంటాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో రెండు రన్స్ చేస్తే ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. మరో 3 వికెట్లు తీస్తే స్టెయిన్ ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు.





Untitled Document
Advertisements