జస్‌ప్రీత్ బుమ్రా 6, 6, 6, 6

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 02:15 PM

జస్‌ప్రీత్ బుమ్రా 6, 6, 6, 6

ఉత్కంఠ మ్యాచ్‌లకి ఐపీఎల్ పెట్టింది పేరు. అభిమానుల్ని మునివేళ్ల నిలబెట్టే ఈ టోర్నీలో అదీ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి తిరుగులేదని రికార్డులు చెప్తున్నాయి. కానీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత ఆండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్ లాంటి విధ్వంసక హిట్టర్లని అలవోకగా బోల్తా కొట్టించేసిన బుమ్రా.. చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన బౌలర్ పాట్ కమిన్స్‌కి ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సమర్పించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 196 పరుగుల లక్ష్యఛేదనకి దిగగా.. 17 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 112/7తో ఓటమి అంచున నిలిచింది. అప్పటికే మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా కేవలం 5 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ని వేసేందుకు బుమ్రా చేతికి ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినివ్వగా.. ఆశ్చర్యకరరీతిలో చెలరేగిపోయిన పాట్ కమిన్స్ వరుసగా 6, 0, 6 ,2 ,6, Wd, 6 బాదేసి ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. దాంతో.. ఒక్కసారిగా బుమ్రా బౌలింగ్ సమీకరణాలు 3-0-5-2 నుంచి 4-0-32-2గా మారిపోయాయి. అయితే.. ఛేదనలో ఆఖరికి కోల్‌కతా 146/9కే పరిమితమైంది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌లు ముగ్గురు మాత్రమే. ఐపీఎల్ 2015 సీజన్‌లో జేపీ డుమిని ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ ఈ రికార్డ్ సాధించగా.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఈ మైలురాయిని అందుకున్నాడు. అయితే ఈ ఇద్దరూ నాలుగు సిక్సర్లని ఓవర్ల గ్యాప్‌లో కొట్టగా.. కమిన్స్ మాత్రం ఒకే ఓవర్‌లో బాదేయడం కొసమెరుపు. పాట్ కమిన్స్‌ని వేలంలో రూ. 15.5 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.






Untitled Document
Advertisements