రఫేల్ జెట్స్ కొనుగోలు ఒప్పందం...కాగ్ తీవ్ర వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 02:20 PM

రఫేల్ జెట్స్ కొనుగోలు ఒప్పందం...కాగ్ తీవ్ర వ్యాఖ్యలు

అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థ డసాల్ట్, ఎంబీడీఏలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం రూ.59,000 కాంట్రాక్టు దక్కించుకున్న డసాల్ట్, ఎంబీడీఏలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందజేయాలన్న బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది. ఒప్పందం ప్రకారం.. ఫ్రెంచ్ సంస్థలు కాంట్రాక్ట్ విలువలో 50 శాతం తిరిగి భారత్‌కు అందజేయాలని పేర్కొంది. ఈ మేరకు కాగ్ సమర్పించిన నివేదికను బుధవారం పార్లమెంట్‌ ముందుంచారు.

గడువులోగా ఒప్పందం ప్రకారం 30 శాతం విమానాలను డీఆర్డీఓకి అందజేస్తామని ఈ రెండు సంస్థలూ 2015 సెప్టెంబర్‌లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యాయని కాగ్ ఆక్షింతలు వేసింది. ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి ఏడేళ్లలోగా మొత్తం విమానాలను అందజేస్తామని చెప్పారని, తొలి మూడేళ్లలో లక్ష్యం నెరవేర్చలేదని నివేదిక తూర్పారబట్టింది.

ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నిర్దేశిత గడువులోగా 2023 నాటికి డసాల్ట్ 58 శాతం, ఎంబీడీఏ 57 శాతం మాత్రమే అందజేసే అవకాశం ఉందని విమర్శించింది. కాగ్ నివేదిక అనేక రక్షణ ఒప్పందాలపై ఆధారపడినప్పటికీ, రఫేల్ విషయంలో మాత్రం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. రఫేల్ ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో తిరస్కరించింది.

‘విదేశీ సంస్థలు కాంట్రాక్టు దక్కించుకోడానికి వివిధ హామీలకు కట్టుబడి ఉంటామని చెబుతారు.. కానీ, అర్హత సాధించిన తర్వాత వాటిని నెరవేర్చడంపై ఆసక్తి చూపడం లేదని అనేక సందర్భాల్లో వెల్లడయ్యిందని’ కాగ్ ఆరోపించింది.

ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 2016 నాటికి ఆరు విమానాలను అందజేయాలని డీఆర్డీఓ కోరగా.. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ఆ సంస్థలు అంగీకరించలేదు.. ఎందుకంటే వాటిలో అధిక భాగం వారి ప్రధాన సామర్థ్యాల పరిధిలో లేవు. తేలికపాటి యుద్ధ విమానాల ఇంజిన్ల (కావేరి) స్వదేశీ అభివృద్ధికి సాంకేతిక సాయం కోసం డీఆర్డీఓ ప్రతిపాదించగా.. డసోల్ట్, ఎంబీడీఏలు దీనిని నెరవేర్చలేకపోయాయి’అని కాగ్ నివేదిక తెలిపింది.

అందువల్ల, ఈ సాంకేతికత బదిలీ కూడా జరుగుతుందా అనేది స్పష్టంగా తెలియదు.. సెప్టెంబర్ 2016లో డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా రక్షణ శాఖ, డీఆర్డీఓలకు సరైన టెక్నాలజీలను గుర్తించి, పొందాల్సిన అవసరం ఉందని వివరించింది.





Untitled Document
Advertisements