పంజాబ్‌లో రైతుల ఆందోళనలు మరింత ఉదృతం

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 03:04 PM

పంజాబ్‌లో రైతుల ఆందోళనలు మరింత ఉదృతం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లులపై పంజాబ్, హరియాణాలో రైతుల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌లో రైతుల ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతోంది. మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతులు.. గురువారం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రత్యేక రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. సెప్టెంబరు 24-26 వరకు ఈ డివిజన్‌లో 14 జతల ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ముందు జాగ్రత్త చర్యల్లో సర్వీసులను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. అమృత్‌సర్-ముంబయి సెంట్రల్, హరిద్వార్-అమృత్‌సర్ జన శతాబ్ది, న్యూఢిల్లీ- జమ్మూతావి, అమృత్‌సర్-న్యూ జలపాయిగురి కరమ్‌భూమి ఎక్స్‌ప్రెస్, నాందేడ్- అమృత్‌సర్ సఛ‌ఖండ్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-జయనగర్ షాహీద్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు రద్దుచేసినట్టు తెలిపారు.

రైల్ రోకోకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపునివ్వగా.. పలు రైతు సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. గురువారం ఉదయం నుంచే రైతులు రైలు పట్టాలపైకి చేరుకుని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 (ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ - 2020) బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హరియాణాలలో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ఆగస్టులోనే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.





Untitled Document
Advertisements