జగన్-అమిత్ షా భేటీ...చర్చించిన అంశాలు

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 03:06 PM

జగన్-అమిత్ షా భేటీ...చర్చించిన అంశాలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రెండుసార్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అలాగే కేంద్ర జల్‌శక్తి మంత్రితో భేటీ అయ్యారు.. వీరితో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులపై షాకు జగన్ వినతి పత్రం అందించారు. 14వ ఆర్థికసంఘం పెండింగ్‌ నిధులు రూ.2254.52 కోట్లు విడుదల చేయాలని.. రాష్ట్రానికి రూ.3,622.07 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.4006.43 కోట్లు తక్షణమే విడుదల చేయాలని.. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అడిగారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుకు రూ.15వేల కోట్లు ఖర్చుకానున్నాయని.. క్రెడిట్‌ పెంచే అధికారం నాబార్డుకు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు చేసి తర్వాత రీయింబర్స్‌ కోరడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో కలిపి రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి నేరుగా నిధులు విడుదల చేయాలన్నారు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.700 కోట్లు వెంటనే విడుదల చేయాలని.. 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు గ్రాంటు పెండింగ్‌ రూ.138.39 కోట్లు విడుదల చేయడంతో పాటు, కాగ్‌ ఆమోదించిన రూ.18,830.87 కోట్లు అనుమతించాలన్నారు.

ప్రజాపంపిణీ వ్యవస్థకు రావాల్సిన రూ.1600 కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర అభివృద్ధి గ్రాంటు కింద మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం పెండింగ్‌ నిధులు రూ.3740.53 కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ (సీఓఆర్‌ఎస్‌) వ్యవస్థను ల్యాండ్‌ రీసర్వే ప్రాజెక్టుకు వినియోగిస్తున్నాం. ఈప్రాజెక్టును డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రామ్‌ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ) పరిగణనలోకి తీసుకోవాలి. తొమ్మిది జిల్లాల్లో సర్వేకు రూ.202.09 కోట్లు విడుదల చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురులో 117 ఎకరాలు, గురజనపల్లిలో 57.9 ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించుకోవడానికి సాల్ట్‌ భూముల బదలాయింపునకు అనుమతి ఇవ్వాలని కోరారు.





Untitled Document
Advertisements