కరోనా సోకి కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూత

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 04:54 PM

కరోనా సోకి కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూత

దేశంలో కరోనా విషాదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి సురేశ్ అంగడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా బారినపడ్డ ఆయన కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మంత్రి సురేశ్ అంగడి మృతి పట్ల పలువురు ప్రముఖులు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


రైల్వే శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న సురేశ్ అంగడికి సెప్టెంబర్ 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్లు వెల్లడించిన ఆయన తనను కలిసిన వారందరూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశేష ప్రజాధరణ ఉన్న ఆయన నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు.

కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సురేశ్ అంగడి ఓ అసాధారమైన కార్యకర్త. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి విశేషంగా కృషి చేశారు. ఆయన అంకితభావం గల ఎంపీ. ప్రజల నుంచి మన్ననలు పొందిన వ్యక్తి. సురేశ్ అంగడి మృతి దిగ్భ్రాంతికరం. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబసభ్యులతోనే ఉన్నాయి. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులనూ వణికిస్తోంది. కేంద్రంలో ఇప్పటికే 10 మందికి పైగా మంత్రులు కరోనా బారినపడ్డారు. వీరిలో కొంత మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకిన మంత్రుల్లో హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి, ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.





Untitled Document
Advertisements