ఐపీఎల్‌లో హిట్ వికెట్ల జాబితా

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 05:55 PM

ఐపీఎల్‌లో హిట్ వికెట్ల జాబితా

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్ బాది ఊపు మీద కనిపించిన హార్దిక్ పాండ్య రస్సెల్ బౌలింగ్‌లో అనూహ్యంగా హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పాండ్య క్రీజ్‌ లోపలికి వెళ్లి ఆఫ్ సైడ్ షాట్ ఆడబోగా.. బ్యాట్ వికెట్లను తాకడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. బెయిల్స్ లైట్లు వెలగడంతో... ఆశ్చర్యపోయిన హార్దిక్ నవ్వుతూ వెనుదిరగ్గా.. ఎలా ఔటయ్యాడో కూడా బౌలర్ రస్సెల్‌కు కాసేపటి వరకు అర్థం కాలేదు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ పది మంది బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్ రూపంలో ఔటవగా.. పాండ్య కూడా ఈ జాబితాలో చేరాడు. డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్, జడేజా లాంటి బ్యాట్స్‌మెన్ సైతం గతంలో హిట్ వికెట్‌గా ఔటయ్యారు.

ఐపీఎల్‌లో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగిన తొలి బ్యాట్స్‌మెన్ ముసావిర్ ఖోటే. 2008లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలో దిగిన ముసావిర్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ శ్రీశాంత్ బౌలింగ్‌లో హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. అదే సీజన్లో శ్రీశాంత్ బౌలింగ్‌లోనే పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ కూడా హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ సీజన్లో మిస్బా బెంగళూరు తరఫున బరిలో దిగాడు.

2009లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ స్వప్నిల్ అస్నోద్కర్.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అల్బీ మోర్కెల్ బౌలింగ్‌లో హిట్ వికెట్ అయ్యాడు. 2012లో సీఎస్‌కే, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. 2012లో ఆర్సీబీ తరఫున ఆడిన సౌరభ్ తివారీ.. హర్భజన్ బౌలింగ్‌లో హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

2016 సీజన్లో సన్‌రైజర్స్‌కు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్ రూపంలో ఔటయ్యారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచ్ మెక్‌క్లెగాన్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ బ్యాట్ స్టంప్స్‌ను తాకింది. అది యువీకి 100వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వార్నర్ పాదం వికెట్లకు తాకింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో దీపక్ హుడా పాదం స్టంప్‌లను తాకింది.

2017 సీజన్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్.. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్‌కు చెందిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ ఆడబోయి కాలితో స్టంప్స్‌ను తన్నాడు.

2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ కూడా హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఛేజింగ్‌లో 17 ఏళ్ల పరాగ్.. హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ ఆండ్రీ రస్సెల్ బౌన్సర్‌ను హుక్ చేయిబోయి బ్యాట్‌తో బెయిల్స్‌ను కొట్టాడు.





Untitled Document
Advertisements