బాలుడి మీదుగా వెళ్లి నిలిచిపోయిన రైలింజన్...వీడియో వైరల్‌

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 11:06 PM

బాలుడి మీదుగా వెళ్లి నిలిచిపోయిన రైలింజన్...వీడియో వైరల్‌

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ అద్భుతం జరిగింది. రెండేళ్ల ఓ బాలుడిని 14 ఏళ్ల అతడి సోదరుడు రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్పుడే అటు వైపుగా వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఇంజిన్ నుంచి లోకో పైలట్ ఆ దృశ్యాన్ని గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. రైలు భారీ శబ్దం చేస్తూ రైలు ఆగిపోయింది. కానీ, రైలింజన్ మాత్రం బాలుడి మీదుగా వెళ్లి నిలిచిపోయింది.

లోకో పైలట్లకు గుండె ఆగినంత పనైంది. వెంటనే వాళ్లు క్యాబిన్ నుంచి కిందకి దిగి బాలుడి వద్దకు పరుగెత్తుకొచ్చారు. ఆ బాలుడి కేకలు విన్నారు. బాలుడికి ఇంచు దూరంలో రైలు చక్రం నిలిచిపోయింది. అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ దృశ్యం చూశాక వారు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని పట్టాలపైకి తోసేసిన బాలుడిని పట్టుకొని గద్దించారు. ఆ తర్వాత చిన్నారిని అతడి తల్లికి అందజేశారు.

లోకో పైలట్ దీవాన్ సింగ్, అసిస్టెంట్ లోకో పైలట్ అతుల్ ఆనంద్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్లను అభినందించారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లబ్‌గర్ రైల్వే స్టేషన్ సమీపంలో సెప్టెంబర్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

‘బ్రేకులు వేయడం క్షణం ఆలస్యమైనా ఆ బాలుడు ప్రాణాలతో బతికేవాడు కాదు. ఆ చిన్నారిని వాళ్లే కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించారు’ అని ఆగ్రా డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీవాస్తవ అన్నారు. ఆ లోకో పైలట్లు ఇద్దరికీ అతి త్వరలో తగిన రివార్డు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.







Untitled Document
Advertisements