'ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితి మారాల్సిందే' చైనాకు భారత్ వార్నింగ్

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 11:56 AM

'ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితి మారాల్సిందే' చైనాకు భారత్ వార్నింగ్

తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత పునరుద్ధరించి, మే నెలకు ముందున్న యథాతథస్థితిని నెలకొల్పడానికి భారత్, చైనాలు చర్చలు కొనసాగిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేలా భారత్, చైనా సైనిక అధికారుల మధ్య ఏడో దశ చర్చలు త్వరలోనే జరగనున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఇటీవల భారత్-చైనా కమాండర్ స్థాయి ఆరో దశ చర్చల తర్వాత పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.


దాదాపు 50 రోజుల తర్వాత ఆరోసారి చర్చలు జరిగాయి.. కానీ, తొలిసారిగా భారత్, చైనాలు దీనిపై సంయుక్త ప్రకటన చేశాయని పేర్కొన్నారు. ఎల్ఏసీ వెంబడిన సైన్యాలను వెనక్కు మళ్లించడానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయనడానికి ఇదే సంకేతమని అన్నారు.

ఇరు సైన్యాలూ తమ భూభాగంలోని శాశ్వత స్థావరాలకు మళ్లి, ఉద్రిక్తతలు తగ్గించడం క్లిష్టమైన ప్రక్రియ అని శ్రీవాస్తవ అన్నారు. ఘర్షణ ప్రాంతాలలో రెండు వైపులా పూర్తిగా విడదీయడానికి కృషి చేస్తున్నప్పటికీ, ఇదే సమయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడం కూడా అవసరం.. తాజా సీనియర్ కమాండర్ల సమావేశం దీనిని పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రక్రియను పరస్పర చర్య ద్వారా సాగాలని, ముందుగా చైనా అలా చేసిన తర్వాత భారత సైన్యం అనుసరిస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు విరుద్ధంగా చైనా అసాధారణంగా నిర్మాణాలు చేపట్టి, దళాలను తరలించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పేర్కొన్నారు.

కమాండర్‌స్థాయి చర్చల్లో బలగాల ఉపసంహరణ కేవలం పాంగాంగ్ సరస్సుకు మాత్రమే పరిమితం కాలేదని, ఘర్షణ జరిగిన అన్ని ప్రాంతాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు. అయితే, చైనా మాత్రం కేవలం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరానికే పరిమితం చేయాలని కోరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భారతీయ దళాలు కీలకమైన శిఖరాలను, స్థావరాలపై ఆధిపత్యం సాధించాయన్నారు.





Untitled Document
Advertisements