ప్రముఖ న్యాయవాది ఖాద్రీని హత్య చేసిన ఉగ్రవాదులు

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 12:06 PM

ప్రముఖ న్యాయవాది ఖాద్రీని హత్య చేసిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌లోని హవాల్‌ చౌక్‌ ప్రాంతంలో ఖాద్రీ ఇంటికి ద్విచక్రవాహనంలో వచ్చిన ముష్కరులు.. అతి సమీపం నుంచి ప్రముఖ న్యాయవాది ఖాద్రీపై కాల్పులు జరిపి పరారయ్యారు. తల, ఇతర భాగాలకు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. టీవీ చర్చల్లో ఎక్కువగా పాల్గొనే ఖాద్రీ.. స్థానిక వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తుండేవారు. వేర్పాటువాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న ఖాద్రీని.. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నుంచి కొన్నేళ్ల కిందట బహిష్కరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భద్రత దళాలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ, తనను ట్రోల్ చేస్తున్నారని సెప్టెంబరు 21న చివరిసారిగా ఫేస్‌బుక్‌లో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఖాద్రీ షేర్ చేశారు. జమ్మూలోని పోలీస్ మీడియా సెంటర్‌కు ట్యాగ్ చేస్తూ.. తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖాద్రీ మామ జమాయితే-ఇస్లామీ నేత గులామ్ ఖాద్రీ వనీని కొన్నేళ్ల కిందట ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇక, 2018 నుంచి ఖాద్రీ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఖాద్రీ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ఆరోపించింది. ఈ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రముఖ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు హత్యచేశారు.

ఖాద్రీ హత్యపై ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖాద్రీని ఎందుకు హత్యచేశారో విచారణలో వెల్లడవుతుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు.

ఖాద్రీ హత్యను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఆయన గత కొద్ది రోజులకు బెదిరింపులను ఎదుర్కొంటున్నారని, ఆయన చేసిన ట్వీట్ చివరి హెచ్చరిక కావడం బాధాకరం అన్నారు.





Untitled Document
Advertisements