జనాభా లెక్కల సేకరణకు నేపాల్ ప్రయత్నం

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 12:13 PM

జనాభా లెక్కల సేకరణకు నేపాల్ ప్రయత్నం

భారత్ భూభాగాలు లిపులేఖ్, లింపుయాధురా, కాలాపానీ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ వివాదాస్పద మ్యాప్‌ను రూపొందించిన నేపాల్.. దీనిని పాఠ్యాంశాల్లో చేర్చి, నాణేలపై ముద్రిస్తోంది. తాజాగా ఈ ప్రాంతాల్లో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ ప్రయత్నిస్తోంది. భారత్‌లో మాదిరిగానే ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన చేపట్టే నేపాల్.. వచ్చే ఏడాది మేలో వీటిని నిర్వహించనుంది. నేపాల్ జాతీయ ప్లానింగ్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సంయుక్తంగా ఈ లెక్కల సేకరణ చేపట్టనున్నాయి.

తాజాగా, లిపులేఖ్, లింపుయాధురా, కాలాపానీ ప్రాంతాల్లో జనగణనకు నేపాల్ అధినాయకత్వం ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టు తెలిపాయి. ఇంటి ఇంటి సర్వే సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషిస్తోందని వివరించాయి. అయితే, ఈ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఈ జనగణనలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిచెబుతున్నారు.

తాము భారతీయులమని నేపాల్ ప్రభుత్వం నిర్వహించే జనగణనలో ఎందుకు పాల్గొంటామని పితోడగఢ్ జిల్లా బుధి గ్రామానికి చెందిన మహేంద్ర బుధియాల్ అనే వ్యక్తి అన్నారు. జనాభా లెక్కలపై నేపాలీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి తమకు తెలియదని పితోడగఢ్ జిల్లా అధికారులు అన్నారు. ఒకవేళ అటువంటి చర్యలకు నేపాల్ ప్రయత్నిస్తే భారత భూభాగంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

హయ్యర్ సెకెండరీ విద్యార్థుల కోసం నేపాల్ భౌగోళిక, ప్రాదేశిక సరిహద్దు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టగా.. దీనికి ముందుమాటను నేపాలీ విద్యాశాఖ మంత్రి గిరిరాజ్ పోఖారెల్ రాశారు. ఉత్తరాఖండ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో నేపాల్ భూభాగంగా ఉంది.. నేపాల్ భౌగోళిక విస్తీర్ణం 1,47,641.28 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో 460 చదరపు కిలోమీటర్లు కాలాపాని ప్రాంతమని నేపాలీ వర్గాలు తెలిపాయి.





Untitled Document
Advertisements