ఎస్పీ బాలు కోలుకోవాలి అంటూ ప్రార్థనలు.. ఉప రాష్ట్రపతి ఫోన్!

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 01:12 PM

ఎస్పీ బాలు కోలుకోవాలి అంటూ ప్రార్థనలు.. ఉప రాష్ట్రపతి ఫోన్!

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయడంతో యావత్ సినీ లోకం ఉలిక్కిపడింది. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి దిగజారిందని సమాచారం అందడంతో కోట్లాది మంది ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాలు ఆరోగ్య పరిస్థితిపై అనుక్షణం టెన్షన్ టెన్షన్ నెలకొంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది.

50 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక రేపో మాపో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారని అభిమానులంతా ఆశిస్తున్న సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఎక్మోపైనే ఉన్నారు. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా విషమించింది. అత్యంత గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. ఆయన పరిస్థితిని నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు'' అని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం ప్రకటించారు.

దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. నిన్న రాత్రి ఆస్పత్రికి వచ్చిన కమల్ హాసన్.. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మీడియాకు చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో బాలు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు 10 మంది ప్రత్యేక వైద్యులతో కూడిన బృందం ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు 'బాలు కోలుకోవాలి, క్షేమంగా తిరిగి రావాలి' అంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు కోట్లాదిమంది అభిమానులు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. మీడియాలో బాలు ఆరోగ్యంపై నిరంతరాయంగా వార్తలు వస్తున్నాయి. గురువారం అర్థరాత్రి 12 గంటల తర్వాత మరో హెల్త్ బులిటెన్ ఇస్తామని ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మరింత ఆదోళన చెందిస్తోంది.





Untitled Document
Advertisements