జన్మనివ్వకపోయినా మోదీ కూడా నా కోడుకే: షహీన్‌బాగ్ దాదీ

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 04:19 PM

జన్మనివ్వకపోయినా మోదీ కూడా నా కోడుకే: షహీన్‌బాగ్ దాదీ

టైమ్ మ్యాగ్‌జైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తులు జాబితాలో సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌ ఆందోళనలకు నాయకత్వం వహించిన 82 ఏళ్ల వృద్ధ మహిళ దాదీ బిల్కిస్ బానో‌కు చోటుదక్కిన విషయం తెలిసిందే. 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి బిల్కిస్ బానో సహా ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్, గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, బయోలజిస్ట్ రవీంద్రకు చోటుదక్కింది.

ఈ విషయం గురించి బిల్కిస్ స్పందిస్తూ.. తనకు గర్వంగా ఉందని, అయితే ఇలాంటి గుర్తింపు తాను ఊహించలేదని అన్నారు. ‘ఖురాన్ షరీఫ్ మాత్రమే చదివాను, స్కూల్‌కి అసలు వెళ్లనే లేదు. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది.. అదే జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం కూడా సంతోషాన్ని కలిగిస్తోంది.. ఆయనకు నా అభినందనలు’ అని అన్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రధాని ఆహ్వానిస్తే ఆయనను కలుస్తారా? అంటే, తప్పకుండా వెళ్లి కలుస్తాను.. నాకెందుకు భయం అని సమాధానం ఇచ్చారు.

అంతేకాదు, మోదీ కూడా నా కోడుకే. తనకు నేను జన్మనివ్వకపోతేనేమి? నా సోదరి అతడికి జన్మనిచ్చింది. అతడు మరింత కాలం జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని షహీన్‌బాగ్ దాదీ హర్షం వ్యక్తం చేశారు. దేశం ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతోందని, మహమ్మారిని ప్రపంచం నుంచి ముందు తరిమికొట్టాలని అన్నారు.

గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టం-2019ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో చేపట్టిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డిసెంబరు నుంచి ప్రారంభమైన ఆందోళనలు మార్చి నెలాఖరు వరకు కొనసాగాయి. ఆందోళనల సమయంలో ఎదురైన అనుభవాలను షహీన్‌బాగ్ దీదీ గుర్తుచేసుకున్నారు. ‘జోరు వర్షం కురిసినా, ఎముకలు కొరికే చలిలోనూ శిబిరంలో కూర్చుని ఆందోళనలు కొనసాగించాం.. జామియా యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టినా బయపడలేదు.. మా ముందే కాల్పులు జరిగినా భయపడలేదు’ అని అన్నారు.

మరో ఇద్దరు బామ్మలతో కలిసి సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌ నిరసన చేపట్టిన బిల్కిస్ దాదీది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్. పదకొండేళ్ల కిందట భర్త చనిపోవడంతో షహీన్‌బాగ్‌లోని తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. భారతదేశంలో అట్టడుగున ఉన్నవారికి గొంతుకగా మారింది అంటూ బిలిస్క్ దాదీ గురించి జర్నలిస్ట్, రచయిత రానా ఆయుబ్ రాశారు. ‘ఒక చేతిలో ప్రార్థన మాల, మరోవైపు జాతీయ జెండాతో బిల్కిస్ భారతదేశంలో అట్టడుగున ఉన్నవారికి స్వరం అయ్యారు. 82 ఏళ్ల వయసులోనూ ఉదయం 8 నుంచి అర్ధరాత్రి వరకు నిరసన స్థలంలో కూర్చున్నారు’ అని ప్రశంసలు కురిపించారు.





Untitled Document
Advertisements