మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 05:15 PM

మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను వెలువరించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది. మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు అందజేయనున్నట్టు పేర్కొంది.

ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,000 మంది ఓటర్లకు మాత్రమే అనుమతిస్తామని, తప్పనిసరిగా భౌతికదూరం నిబంధన అమలుచేస్తామని స్పష్టం చేసింది. మొత్తం 7.29 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ విధిగా భౌతికదూరం పాటించాలని సూచించింది. షెడ్యూల్ వెలువడటంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.

పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంటపాటు పెంచినట్టు తెలిపింది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయి ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు చివరి గంటలో ఓటింగ్‌కు అవకాశం కల్పించినట్టు తెలియజేసింది. పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటువేసే వెసులుబాటు కల్పించినట్టు సీఈసీ పేర్కొంది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.





Untitled Document
Advertisements