ఎస్పీ బాలు ఆఖరి పాట అదే : రఘు కుంచె

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 07:09 PM

ఎస్పీ బాలు ఆఖరి పాట అదే : రఘు కుంచె

గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఐదు దశాబ్దాలకు పైగా తన పాటతో యావత్తు భారత సంగీత ప్రియులను అలరించారు. తన సుధీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. బాలుతో పనిచేయాలనే కోరిక ప్రతి సంగీత దర్శకుడికి ఉంటుంది. కానీ, ఆ అవకాశం కొంత మందికి మాత్రమే దక్కింది. వారిలో రఘు కుంచె ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె.. ‘పలాస 1978’ సినిమా కోసం ఎస్పీ బాలుతో కలిసి పనిచేశారు. ఆయనతో ఒక పాట పాడించుకున్నారు. అదే బాలు పాడిన ఆఖరి పాట. అందమైన పాట.

‘పలాస 1978’లో ‘ఓ సొగసరి’ అంటూ సాగే పాటను బాలు ఆలపించారు. ఇది రెట్రో ఫీల్ ఉన్న పాట కావడంతో బాలు గారిని పాడమని అడిగానని రఘు కుంచె ‘సమయం’తో అన్నారు. తాను మ్యూజిక్ డైరెక్టర్ అయిన 10 ఏళ్ల తర్వాత ఎస్పీ బాలుతో పనిచేసే అవకాశం తనకు దక్కిందని రఘు కుంచె వెల్లడించారు. ఈ పదేళ్లలో బాలుతో కలిసి పనిచేయలేకపోవడం తన దురదృష్టమని అన్నారు. అయినప్పటికీ, కనీసం ఒక్కపాటైనా ఆయనతో పాడించుకోగలిగానని, అది తన అదృష్టమని రఘు చెప్పారు. అదే పాట బాలు గారికి ఆఖరి పాట కావడం అదృష్టమో, దురదృష్టమో చెప్పలేని విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘పలాస’ హీరో రక్షిత్ అట్లూరి సైతం బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల స్పందించారు. ‘‘డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో లేకపోవడం చాలా బాధాకరం. పలాస చిత్రంలో ఆయన ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సందర్భంలో ఆయన్ని కలిసే అవకాశం దక్కింది. చిన్నప్పటి నుంచీ ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన్ని కలిసిన కొద్దిపాటి సమయంలోనే ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయత, ప్రోత్సాహం మరిచిపోలేను. బహుశా ఆయన పాడిన ఆఖరి పాట మాదే అనుకుంటా. బాలసుబ్రహ్మణ్యం గారి లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ, ఇండియన్ సినిమా ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు. ఆయన మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని రక్షిత్ వీడియో మెసేజ్ విడుదల చేశారు.

కాగా, ‘పలాస 1978’ సినిమాకు రఘు కుంచె సంగీతం దర్శకత్వం వహించడంతో పాటు ఆ చిత్రంలో ఆయన నటించారు. ప్రతికథానాయకుడి పాత్ర పోషించారు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి.






Untitled Document
Advertisements