అత్యవసర వినియోగం కింద ప్రజలకు చైనా వ్యాక్సిన్!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 11:27 AM

చైనాలో ప్రస్తుతం మూడు కరోనా వ్యాక్సిన్ లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్ లతో పాటు, సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అయితే తుది దశ ప్రయోగాలు జరుపుకుంటున్న ఓ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి కూడా ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు.

చైనాలో ఎమర్జెన్సీ ప్రోగ్రాం కింద వేల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. వైరస్ తాకిడి ఎక్కువగా ఉండే ఆరోగ్య కార్యకర్తలకు, ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందించాలన్న నిర్ణయానికి చైనా స్టేట్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికారి చెప్పారు. అత్యవసర వినియోగం అంశంపై డబ్ల్యూహెచ్ఓకి జూన్ లోనే సమాచారం అందించినట్టు తెలిపారు.

కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా నిలిచిన చైనాలో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. 2021 నాటికి 100 కోట్ల డోసుల ఉత్పత్తి జరుగుతుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. ఇప్పటికే రష్యాలో ఇదే తరహాలో క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే వ్యాక్సిన్ వినియోగం అందుబాటులోకి రావడం తెలిసిందే. ఇలాంటి వ్యాక్సిన్ల భద్రతపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో, చైనా కూడా ముందుగానే వ్యాక్సిన్ ను అందిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.





Untitled Document
Advertisements