ధోనీ సేన ఓటమికి తప్పిదాలు

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:36 PM

ధోనీ సేన ఓటమికి  తప్పిదాలు

ఐపీఎల్ తొలి వారంలోనే మూడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై తొలి మ్యాచ్‌లో గెలిచి.. వరుసగా రెండింటిలో ఓడింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ 131 పరుగులకే పరిమితమైంది. పరుగుల వ్యత్యాసం పరంగా చెన్నైకి ఇది మూడో భారీ ఓటమి కావడం గమనార్హం.

పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనవసర పరుగులు, షాట్లకు యత్నించి ఔటైన ఢిల్లీ ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో చాలా బాగా ఆడారు. తొలి వికెట్‌కు పృథ్వీ షా, శిఖర్ ధావన్ 94 రన్స్ జోడించారు. ఆది నుంచే దూకుడుగా ఆడిన షా... చక్కటి షాట్లతో అలరించాడు. 43 బంతుల్లో 64 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ... 200 రన్స్ చేసిన చెన్నై.. ఢిల్లీపై అదే దూకుడు కనబర్చలేకపోయింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. అతి జాగ్రత్తకు పోయిన సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ 6 ఓవర్లలో 34 రన్స్ మాత్రమే చేయగలిగారు. రాయుడు స్థానంలో టీంలో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 10 బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లలో చెన్నై 3 వికెట్ల నష్టానికి 47 రన్స్ మాత్రమే చేసింది.

టాప్ ఆర్డర్ స్లో బ్యాటింగ్ కారణంగా సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో డుప్లెసిస్ (43), కేదార్ జాదవ్ (26) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు. టాప్-4లో విజయ్, వాట్సన్, గైక్వాడ్‌లలో ఏ ఒక్కరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురు దాడి చేసే సాహసం చేయలేకపోయారు. రైనా, రాయుడు లాంటి బ్యాట్స్‌మెన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

మ్యాచ్‌లో ఓవర్లు పడే కొద్ది పిచ్ స్లోగా మారింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ.. మంచు ప్రభావం ఉంటుందని ఆశించాడు. కానీ అలాంటిదేం లేకపోయింది. దీంతో లక్ష్య చేధన కష్టంగా మారింది.

ఈ మ్యాచ్‌లో జాదవ్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిన ధోనీ.. తను మాత్రం ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ధోనీ క్రీజ్‌లోకి వచ్చే సమయానికే చెన్నై ఓటమి ఖాయమైంది. ఆరంభంలోనే వికెట్లు పడినప్పుడైనా.. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబడితే బాగుండేది.

ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించని రుతురాజ్‌ను ధోనీ నాలుగోస్థానంలో పంపించాడు. అతడు బంతులను వృథా చేయడంతో ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగింది. మిడ్ ఓవర్లలో ధోనీ తన ప్రధాన బౌలర్లలో బౌలింగ్ చేయించలేదు. మధ్య ఓవర్లలో ఒకటి లేదా రెండు వికెట్లు పడితే.. ఢిల్లీ తక్కువ స్కోరు చేసి ఉండేది.

ఢిల్లీ జట్టులో అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం కోసం ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన రవీంద్ర జడేజా లేదా సామ్ కర్రాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపితే బాగుండేది. ఓవరాల్‌గా చూస్తే.. ఈ మ్యాచ్‌లో చెన్నై సరైన గేమ్ ప్లాన్‌తో బరిలో దిగలేదనిపించింది.





Untitled Document
Advertisements