SRH vs KKR: రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసి

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:38 PM

SRH vs KKR: రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసి

ఐపీఎల్ మొదటి వారం ముగిసింది. రెండో వారంలో తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ మధ్య నేడు (శనివారం) జరగనుంది. ఇరు జట్లు తమ ఫస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో బరిలో దిగుతున్నాయి. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ వైఫల్యంతో ఓడింది. మరోవైపు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా దారుణ పరాభవం చవి చూసింది.

ఇరు జట్లు ఇప్పటి వరకూ 17సార్లు ముఖాముఖి తలపడగా.. కోల్‌కతా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడింట్లో గెలిచి, రెండింట్లో ఓడింది. అబుదాబిలో నైట్ రైడర్స్ 4 మ్యాచ్‌లు ఆడి ఒక్క దాంట్లో గెలవగా... సన్‌రైజర్స్ ఒకే మ్యాచ్ ఆడి ఓడింది.

బెంగళూరు జరిగిన మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడబోయి మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో ఔటవడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో గాయపడిన మిచెల్ మార్ష్ రీప్లేస్‌మెంట్‌గా జాసన్ హోల్డర్ పేరును సన్‌రైజర్స్ ప్రకటించింది. కానీ అతడు అంత త్వరగా బరిలో దిగే అవకాశం లేదు. మార్ష్ స్థానంలో ఆడించేందుకు ఫాబియన్ అలెన్స్, కేన్ విలియమ్సన్, మహ్మద్ నబీ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు సన్‌రైజర్స్‌కు అందుబాటులో ఉన్నారు.

వీరిలో విలియమ్సన్ ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ లేదు. దీంతో మార్ష్ స్థానంలో నబీ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. యూఏఈలో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడికి ఉంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే సన్‌రైజర్స్ రెండో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో బర్త్ డే బాయ్ బెయిర్‌స్టో మెరుపులు మెరిపించాలని సన్‌రైజర్స్ కోరుకుంటోంది.

మరోవైపు కోల్‌కతా జట్టు కూర్పులు దినేశ్ కార్తీక్‌కు తలనొప్పిగా మారాయి. బౌన్సర్లను ఎదుర్కోవడంలో సునీల్ నరైన్ బలహీనత తొలి మ్యాచ్‌లో మరోసారి బయటపడింది. దీంతో అతణ్ని లోయర్ ఆర్డర్‌లో ఆడించొచ్చు. కోల్‌కతా హిట్టర్లు ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

కోల్‌కతా రూ.15.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్.. తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చాడు. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందే బరిలో దిగడానికి అనుమతి రావడంతో కమిన్స్ ప్రాక్టీస్ లేకుండానే ముంబైపై ఆడాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడు సత్తా చాటుతాడని కోల్‌కతా ఆశిస్తోంది.





Untitled Document
Advertisements