అత్యాధునిక ఆయుధ వ్యవస్థ రూపకల్పనలో భారత్‌కు ఇజ్రాయేల్‌ సహకారం

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:47 PM

అత్యాధునిక ఆయుధ వ్యవస్థ రూపకల్పనలో భారత్‌కు ఇజ్రాయేల్‌ సహకారం

ఇప్పటికే భారత్, ఇజ్రాయేల్ మధ్య రక్షణ సహకారం కొనసాగుతుండగా.. ఈ బంధం మరింత బలపడనుంది. తాజాగా, అత్యాధునిక ఆయుధ వ్యవస్థ రూపకల్పనలో సహకారం, రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని యోచిస్తున్నాయి. రక్షణ సహకారంపై ఉమ్మడి ప్రాజెక్టుల ప్రోత్సాహానికి భారత రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని సబ్-వర్కింగ్ గ్రూప్‌ను గురువారం ఏర్పాటు చేశారు.

అల్పాదాయ దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం, సహ-అభివృద్ధి, సహ- ఉత్పత్తి, సాంకేతిక భద్రత, కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణలను ఉమ్మడిగా బదిలీ చేయడంపై ఈ గ్రూప్ ప్రధానంగా దృష్టిసారించనుంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోన్న నాలుగు ప్రధాన దేశాల్లో ఇజ్రాయేల్ ఒకటి. ఏటా బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు అందజేస్తోంది.

‘భారత రక్షణ పరిశ్రమ ప్రస్తుతం బలంగా ఉంది.. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సహ-అభివృద్ధి, సహ- ఉత్పత్తి ప్రాజెక్టులను ఇరు దేశాలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది’ అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

‘క్షిపణులు, సెన్సార్లు, సైబర్ సెక్యూరిటీ, వివిధ ఉప-రక్షణ వ్యవస్థలలో ఇజ్రాయేల్ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందని ఆయన అన్నారు.
సబ్-వర్కింగ్ గ్రూప్ (ఎస్‌డబ్ల్యూజీ)కి రక్షణ శాఖ ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ విభాగం సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజూ,ఇజ్రాయేల్ ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఇయల్ కలిఫ్ నేతృత్వం వహిస్తున్నారు.

డీఆర్డీఓ-ఇజ్రాయేల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా రూ.30,000 కోట్లతో చేపట్టిన ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే అత్యాధునిక బారక్-8 క్షిపణులు సాయుధ దళాల్లో చేరుతున్న తరుణంలో ఎస్‌డబ్ల్యూజీ ఏర్పాటుచేయడం విశేషం.

ఇప్పటికే ఐఏఐ, రఫేల్ అడ్వాన్సడ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎల్‌బిట్, ఎల్టా సిస్టమ్స్ వంటి ఇజ్రాయేల్‌ సంస్థలతో కలిసి భారతీయ కంపెనీలు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టాయి. ఇందులో కళ్యాణి గ్రూప్, రఫేల్ మధ్య గురువారమే అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్-ఇజ్రాయేల్ మధ్య రహస్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతుండగా.. పాకిస్థాన్‌తో 1999 కార్గిల్ యుద్ధం సమయంలో అత్యవసరంగా ఆయుధాలను సరఫరా చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడగా.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది.





Untitled Document
Advertisements