భారీ వర్షాలు: హైదరాబాద్‌లో హై అలర్ట్!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:52 PM

భారీ వర్షాలు: హైదరాబాద్‌లో హై అలర్ట్!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. ఈరోజు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాత్రంతా కూడా వర్షం కురుస్తూనే ఉంది.

ఇవాళ ఉదయం నుంచి కూడా నగరం మొత్తం వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అటు డిజాస్టర్ టీం కూడా రంగంలోకి దిగింది. ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపధ్యలలో ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని, నాలాల వద్ద ప్రమాదం పొంచి ఉండటంతో బయటకు ఎవరూ రావద్దని జీహెచ్ఎంసి అధికారులు హెచ్చరిస్తున్నారు.

వరద నీటితో హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడ ఆగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది. హయత్ నగర్‌లో అత్యధికంగా 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కరీంనగర్‌, ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లా. మొయినాబాద్ మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.





Untitled Document
Advertisements