జీవీఎల్, రాంమాధవ్‌కు బీజేపీ అధిష్టానం షాక్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 07:18 PM

జీవీఎల్, రాంమాధవ్‌కు బీజేపీ అధిష్టానం షాక్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అగ్రనేతలుగా ఎదిగిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం మాధవ్, జీవీఎల్ నరసింహారావుకు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన జగత్ ప్రకాష్ నడ్డా శనివారం తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. అయితే ఢిల్లీలో గత పదేళ్లుగా బీజేపీలో కీలక నేతలుగా చక్రం తిప్పుతున్న రాంమాధవ్, జీవీఎల్‌కు తన కార్యవర్గంలో చోటివ్వకపోవడం చర్చకు దారి తీసింది.

బీజేపీ ఉపాధ్యక్షులుగా 13 మందిని, జాతీయ కార్యదర్శులుగా 13 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మంది, ప్రధాన కార్యదర్శులుగా 8 మందికి జేపీ నడ్డా బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌కు పదవులు కట్టబెట్టారు. అలాగే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. వాస్తవానికి సునీల్ దియోధర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, ఏపీ నుంచి ఇద్దరికి మాత్రమే బీజేపీ జాతీయ కమిటీలో స్థానం దక్కింది.

ఇక రామ్‌ మాధవ్‌, జీవీఎల్‌ నరసింహారావుకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. వీరిని బీజేపీ పదవుల నుంచి తప్పించడానికి గల కారణాలు ఏంటనే దానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జీవీఎల్ నరసింహారావుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీని టార్గెట్ చేస్తూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా మారాయి. అలాగే సీఎం జగన్ బావమరిది బ్రదర్ అనిల్‌తో జీవీఎల్‌కు బంధుత్వం ఉందంటూ టీడీపీ నేతలు భారీగా ట్రోల్ చేశారు. అయితే తనకు జగన్ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదని జీవీఎల్ స్పష్టతనివ్వాల్సి వచ్చింది. తనపై ఉన్న ఈ ఆరోపణలను తొలగించుకునేందుకు ఇటీవలే వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ మాటల దాడి కూడా పెంచారు. ఇందులో భాగంగానే ఏపీలో హిందువుల పరిస్థితి ఆఫ్గనిస్థాన్ కంటే దారుణంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో జీవీఎల్‌ను కేంద్ర కమిటీ నుంచి తప్పించడం గమనార్హం.

అలాగే బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా చక్రం తిప్పే రాంమాధవ్‌ సైతం కమిటీలో చోటు దక్కకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాంమాధవ్‌ను కేంద్ర కేబినెట్‌లో తీసుకునేందుకే ఆయన్ను బీజేపీ బాధ్యతల నుంచి తప్పించారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆరెస్సెస్‌తోనూ ఎంతో అనుబంధం ఉన్న రాంమాధవ్‌ను బీజేపీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టదని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకే పార్టీ బాధ్యతల నుంచి తప్పించారనే వాదన వినిపిస్తోంది. రాంమాధవ్, జీవీఎల్‌ను ఏ కారణాలతో బీజేపీ బాధ్యతల నుంచి తప్పించారో త్వరలోనే తేలనుంది.

ఇక, బీజేపీ నూతన కార్యవర్గానికి ఆ పార్టీ నేత రాంమాధవ్‌ అభినందనలు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించే అవకాశం తనకు కల్పించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్‌ మాధవ్‌ ట్వీట్‌ చేశారు. అలాగే నూతన కార్యవర్గానికి జీవీఎల్ నరసింహారావు అభినందనలు తెలిపారు.





Untitled Document
Advertisements