నలుగురు సెలబ్రిటీల పేర్లు బయటపెట్టిన రకుల్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:43 PM

నలుగురు సెలబ్రిటీల పేర్లు బయటపెట్టిన రకుల్

డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ముందుగా తనకు ఎన్‌సీబీ నుంచి సమన్లు అందలేదని బుకాయించిన రకుల్.. చివరకు శుక్రవారం రోజు ముంబై చేరుకొని ఎన్‌సీబీ విచారణలో పాల్గొంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆమె పలువురి పేర్లు బయటపెట్టడమే గాక, కీలక విషయాలపై స్పందించినట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెకు డ్రగ్స్ మాఫియాతో ఆమెకున్న సంబంధాలపై కూపీ లాగారట ఎన్‌సీబీ అధికారులు. అయితే డ్రగ్ చాట్స్ మాత్రం చేసినట్లు అంగీకరించిన రకుల్.. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ మాఫియాతో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ విచారణలో భాగంగా ఆమె మరో నలుగురి పేర్లు బయటపెట్టిందని తెలుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి తన స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేశాడని రకుల్ వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకుల్ బయటపెట్టిందని తెలుస్తుండటంతో సినీ వర్గాలు వణికిపోతున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు క్షితిజ్ అత్యంత సన్నిహిత వ్యక్తి అని తెలుస్తున్న నేపథ్యంలో కరణ్‌ను కూడా ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలాఉంటే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌ శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరయ్యారు. వీరి ద్వారా కూడా ఎన్‌సీబీ అనేక కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Untitled Document
Advertisements