ఐరాసలోని లోపాలను ఎత్తిచూపిన ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:50 PM

ఐరాసలోని లోపాలను ఎత్తిచూపిన ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని నిలదీశారు. యావత్‌ ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌వైపు చూస్తోందని, తమకున్న సామర్థ్యంతో మానవాళిని ఈ మహమ్మారి నుంచి బయటపడేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శనివారం ప్రసంగించారు.

‘‘ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన ఈ 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించింది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం జరగకపోయినప్పటికీ అనేక యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరిగాయి. ఉగ్రదాడుల్లో ఎంతో మంది పౌరులు మరణించారు. 1945లో ఐరాస ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా వేరు. 21వ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరగాలి. సంస్కరణల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.

‘‘ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఇంకెంత కాలం నిర్ణయాధికారాలకు దూరంగా ఉంచుతారు? ప్రపంచ జనాభాలో 18 శాతం మంది మా దేశంలోనే ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని కుటుంబంగా భావించే సంప్రదాయం మా దేశానిది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్న దేశం నిర్ణయాధికారం కోసం ఇంకెంత కాలం వేచిచూడాలి?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 150కి పైగా దేశాలకు అవసరమైన ఔషధాలను భారత్‌ అందించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేసే దేశం భారత్‌ అని, ఈ సంక్షోభం నుంచి మానవాళిని బయట పడేగల సామర్థ్యం భారత్‌ సొంతమని తేల్చి చెప్పారు.





Untitled Document
Advertisements