ఐరాసలో పాక్‌కు భారత్ అల్టిమేటం

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:54 PM

ఐరాసలో పాక్‌కు భారత్ అల్టిమేటం

ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించగా.. భారత్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం యుఎన్‌జీఏలో కశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత్ వెంటనే స్పందించి, దాయాది ప్రకటనపై సమాధానం ఇచ్చే హక్కు వినియోగించుకోవాలని ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించింది. ఐరాసలో భారత ప్రతినిధి మిజిటో వినిటో సమావేశం వేదిక నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇమ్రాన్ వీడియోను విర్చువల్ ద్వారా ప్రదర్శించారు.

ఈ వీడియో ప్రసంగంలో పాక్ ప్రధాని కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై వినిటో స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ‘కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. దీనిని ఎవరూ విడదీయలేరు.. అక్కడ నియమాలు, చట్టాలు పూర్తిగా భారత అంతర్గత విషయం’ అని సమాధానం ఇచ్చారు.

అంతకు ముందు పాక్ ప్రధాని రికార్డ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యకు పాకిస్థాన్ శాంతియుత పరిష్కారం కోరుకుంటుంది.. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నుంచి చేపట్టిన చర్యలను భారత్ ఉపసంహరించుకోవాలి.. జమ్మూ కశ్మీర్‌లో సైనిక దిగ్బంధనం, మానవహక్కుల ఉల్లంఘనల నిలిపివేయాలి’ అని వ్యాఖ్యానించారు.

కరుడగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదిని అమరడంటూ పార్లమెంట్‌లోనే ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను గుర్తుచేశారు. మధ్యయుగవాదంలో కూరుకుపోయిన ఒక దేశం కోసం, శాంతి, చర్చలు, దౌత్యం వంటి ఆధునిక నాగరిక సమాజం సిద్ధాంతాలు చాలా దూరంలో ఉందని అర్థం చేసుకోవచ్చని చురకలంటించారు.

‘39 ఏళ్ల కిందట దక్షిణాసియాలో తన సొంత ప్రజలను చంపి మారణహోమానికి పాల్పడిన దేశం.. ఇన్నేళ్ల తరువాత కూడా తాను చేసిన ఘోరాలకు హృదయపూర్వక క్షమాపణ చెప్పనందుకు సిగ్గులేని దేశం కూడా ఇదే. ప్రభుత్వం నిధుల నుంచి ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలోని ఉగ్రవాదులకు పెన్షన్లు అందించే దేశం ఇదే. ఐరాస నిషేధించిన అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడంలో సందేహాస్పదమైన వ్యత్యాసం ఉన్న దేశం ఇదే’అని తూర్పారబట్టారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ స్పందిస్తూ.. కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే వివాదం ఉందని, ఈ ప్రాంతం వదిలిపెట్టి పాకిస్థాన్ వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడంపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై చర్చించి, మద్దతు కూడగట్టే ప్రయత్నం పాక్ చేస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.

ఇమ్రాన్ ప్రసంగం తర్వాత ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ట్విట్టర్‌లో స్పందించారు. ‘తన గురించి చెప్పుకోడానికి ఏమీలేని, విజయాలు లేని, ప్రపంచానికి సహేతుకమైన సూచన అందించలేని వ్యక్తి నిరంతర ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. ఈ సమావేశం అబద్ధాలు, తప్పుడు సమాచారం, దుర్మార్గాన్ని వ్యాపింపజేయడాన్ని మేము చూశాం. పాక్ అధినేత (ఇమ్రాన్ ఖాన్) అత్యంత విలువైన ఈ సమావేశంలో నేడు ఉపయోగించిన పదాలు ఐక్యరాజ్యసమితి సారాంశాన్ని కించపరుస్తాయి’ ఘాటుగా చురకలంటించారు.





Untitled Document
Advertisements