జోరువానలోనూ కర్తవ్వ్యాన్ని వదలని కానిస్టేబుల్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 09:00 PM

జోరువానలోనూ కర్తవ్వ్యాన్ని వదలని కానిస్టేబుల్

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ఇంతటి కీలకమైన హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌ కూడలి వద్ద కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. చిరుజల్లులుగా ప్రారంభమై కుండపోత వర్షంగా మారింది. అయినా ఏమాత్రం వెనుక్కి చూసుకోకుండా జోరు వానలో తడుస్తూనే, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో నిబద్ధతతో కానిస్టేబుల్ శ్రీనివాస్ విధులు నిర్వర్తించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానలో ఏ మాత్రం తప్పిదం జరిగినా ట్రాఫిక్ స్తంభించిపోయేది. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిమగ్నమై కానిస్టేబుల్ శ్రీనివాస్ చూపిన చొరవకు.. రాష్ట్ర హోం మాంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయంలో సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను దుశ్శాలువతో సత్కరించి, తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు.






Untitled Document
Advertisements