ఐపీఎల్ 2020 సీజన్‌లో తెరపైకి కొత్త సెంటిమెంట్

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:33 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో తెరపైకి కొత్త సెంటిమెంట్

ఐపీఎల్ 2020 సీజన్‌లో కొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. 2008 నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా.. 13 ఏళ్లలో తొలిసారి కెప్టెన్లు తాము టాస్ గెలవకూడదని బలంగా కోరుకుంటున్నారు. దానికి కారణం ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌‌లు ముగియగా.. ఒక మ్యాచ్‌లో మినహా ఏడింటిలోనూ టాస్ గెలిచిన జట్టే ఓడిపోయింది. తాజా టోర్నీలోని ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేందుకు శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సాహసోపేతంగా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. ఇప్పుడు కెప్టెన్ల‌కి టాస్ ఒక తలనొప్పిగా మారిపోయింది.

వాస్తవానికి ఐపీఎల్ లాంటి టోర్నీలో సగం మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్ణయించేస్తుంది. పిచ్‌‌‌కి అనుగుణంగా ఫస్ట్ బ్యాటింగ్ లేదా ఛేదనకి దిగడమా అనేది టాస్ గెలిచిన కెప్టెన్ తెలివిగా నిర్ణయించుకుని గెలిచిన మ్యాచ్‌‌లు ఐపీఎల్‌లో సగానికి పైనే ఉన్నాయని రికార్డులు చెప్తున్నాయి. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకూ జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆరు సార్లు గెలుపొందగా.. ఛేదనకి దిగిన జట్టు రెండు సార్లు మాత్రమే గెలుపొందింది. కానీ.. 7 మ్యాచ్‌ల్లోనూ ఒకటే కామన్ పాయింట్. టాస్ గెలిచిన టీమ్ ఓడిపోయింది. దాంతో.. ఐపీఎల్‌లో టాస్ గెలవకూడదని ఇక కెప్టెన్లు కోరుకుంటారేమో..?
ఐపీఎల్ 2020లో మ్యాచ్ టాస్, రిజల్ట్‌లను ఒకసారి పరిశీలిస్తే..?
1. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
2. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది.
3. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓడింది.
4. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
5. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 49 పరుగుల తేడాతో ఓడిపోయింది.
6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఆరో మ్యాచ్‌లో ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 97 పరుగుల తేడాతో ఓడింది
7. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓడింది.
8. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన 8వ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.





Untitled Document
Advertisements