నేటితో ముగియనున్న ఐపీఎల్ 2020 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 04:08 PM

నేటితో ముగియనున్న ఐపీఎల్ 2020 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో

నేటితో ఐపీఎల్ 2020 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ముగియనుంది. ఈ సీజన్లో క్యాప్డ్ ప్లేయర్లను సైతం బదిలీ చేసుకోవడానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అవకాశం కల్పించినప్పటికీ...ఫ్రాంచైజీలేవీ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌ పట్ల సుముఖంగా లేవని అర్థం అవుతోంది. వేరే ఫ్రాంచైజీల నుంచి ఆటగాళ్లను తెచ్చుకుని.. విజయావకాశాలను పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. జట్లు ఆ దిశగా ప్రయత్నించలేదు. ఐపీఎల్ 2019 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మాత్రమే వీలుండేది. ఈ సీజన్లో క్యాప్డ్ ప్లేయర్ల బదిలీకి కూడా అవకాశం కల్పించినా ఫ్రాంచైజీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దీనికి కారణాలేంటో చూద్దాం.. మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఓ జట్టు నుంచి మరో జట్టుకు మారిన ఆటగాడు.. తాను బయటకు వచ్చిన జట్టుతో జరిగే మ్యాచ్‌ల్లో ఆడేందుకు వీల్లేదు. ఉదాహరణకు.. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇమ్రాన్ తాహిర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుందనుకుంటే.. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో అతడు కోల్‌కతా తరఫున ఆడకూడదు. అంతే కాదు ఈ పద్ధతిలో ఆటగాళ్ల బదిలీ తాత్కాలికం. మళ్లీ తాహిర్ ఉదాహరణే తీసుకుంటే.. కోల్‌కతా అతణ్ని చెన్నై నుంచి తీసుకున్నప్పటికీ.. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్‌ల్లో మాత్రమే అతడు కోల్‌కతా తరఫున ఆడతాడు. ఒకవేళ నైట్ రైడర్స్ ఫైనల్స్‌కు చేరింది అనుకుంటే.. లీగ్ దశలోని మ్యాచ్‌లతోపాటు.. ప్లేఆఫ్స్.. ఫైనల్లో మాత్రమే అతడు కోల్‌కతా జట్టులో సభ్యుడిగా ఉంటాడు. 2021 సీజన్ నాటికి మళ్లీ తన మాతృ జట్టయిన చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాల్సి ఉంటుంది. సీజన్ మధ్యలో తమ జట్టు నుంచి మరో జట్టుకు వెళ్లే ఆటగాడు తమ ప్రణాళికలు, వ్యూహాలను వేరే జట్టుకు చేరవేస్తారేమోనని ఫ్రాంచైజీలు భయపడే అవకాశం ఉంది. ఒక వేళ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాణ్ని వదులుకున్న తర్వాత.. జట్టులో ఎవరైనా గాయపడితే.. అప్పుడు మళ్లీ రీప్లేస్‌మెంట్ సమస్య తలెత్తుంది. ఇలా జరిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్లను ఆడించొచ్చా లేదా అనే విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లేదా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. సన్‌రైజర్స్ విషయమే తీసుకుంటే.. గాయపడిన మిచెల్ మార్ష్, భువీ స్థానాల్లో జాసన్ హోల్డర్, యర్రా పృథ్వీరాజ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. వీరి స్థానంలో వేరే జట్లకు చెందిన ఆటగాళ్లను తీసుకుంటే ఆడొచ్చా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇవే నిబంధనలు కొనసాగితే గనుక.. 2021 సీజన్లోనూ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఏ జట్టు కూడా ఆటగాళ్లను బదిలీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయదు. ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం అనేది తాత్కాలిక ప్రతిపాదకన కాకుండా శాశ్వతంగా ఉండేలా రూల్స్ మార్చాలి.. లేదంటే ఈ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో అనేదే అవసరం లేదు.

Untitled Document
Advertisements