రాజస్థాన్‌పై బెంగుళూరును ఒంటిచేత్తో గెలిపించిన ABD

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:47 PM

రాజస్థాన్‌పై బెంగుళూరును ఒంటిచేత్తో గెలిపించిన ABD

ఐపీఎల్ 2020 సీజన్‌‌లో పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ సంచలన ఇన్నింగ్స్‌తో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 22 బంతుల్లో 1x4, 6x6) విధ్వంసకరరీతిలో చెలరేగిపోవడంతో 178 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు `బంతులు మిగిలి ఉండగానే 179/3తో బెంగళూరు ఛేదించేసింది. తాజా సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఆరో విజయంకాగా.. రాజస్థాన్‌కి ఇది ఆరో ఓటమి. 178 పరుగుల లక్ష్య ఛేదనని ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35: 37 బంతుల్లో 2x4), అరోన్ ఫించ్ (14: 11 బంతుల్లో 2x4) దూకుడుగా ఆరంభించారు. కానీ.. మెరుగైన ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. మూడో ఓవర్‌లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఫించ్ ఔటవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ (43: 32 బంతుల్లో 1x4, 2x6) స్కోరు బోర్డుని నడిపించే బాధ్యతని తీసుకుని పడిక్కల్‌తో కలిసి రెండో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 102 వద్ద పడిక్కల్ ఔటవగా.. తర్వాత ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ కూడా వికెట్ చేజార్చుకున్నాడు. కోహ్లీ కొట్టిన బంతి సిక్స్‌గా వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ రాహుల్ తెవాటియా క్యాచ్‌గా అందుకున్నాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. 16వ ఓవర్ వేసిన జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్ మార్చాడు. ఆ తర్వాత ఓవర్‌లో ఉనద్కత్ బౌలింగ్‌లోనూ ఒక బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన ఏబీడీ.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో రక్షణాత్మకంగా ఆడి ఒక ఫోర్‌తో సరిపెట్టాడు. కానీ.. 19వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన ఉనద్కత్‌కి ఏబీ చుక్కలు చూపించేశాడు. ఆ ఓవర్‌లో తొలి మూడు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన ఏబీ.. 25 పరుగులు రాబట్టడంతో సమీకరణం ఒక్కసారిగా 12 బంతుల్లో 35 పరుగుల నుంచి 6 బంతుల్లో 10 పరుగులుగా మారిపోయింది. దాంతో.. చివరి ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌కిరాగా.. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచిన డివిలియర్స్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. డివిలియర్స్‌తో పాటు స్లాగ్ ఓవర్లలో గురుకీరత్ సింగ్ మన్ (19 నాటౌట్: 17 బంతుల్లో 1x4) సమయోచితంగా పరుగులు రాబట్టాడు. మ్యాచ్‌లో అంతకముందు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (57: 36 బంతుల్లో 6x4, 1x6), ఓపెనర్ రాబిన ఉతప్ప (41: 22 బంతుల్లో 7x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌మోరీస్ 4 వికెట్లు పడగొట్టగా.. చాహల్‌కి రెండు వికెట్లు దక్కాయి.





Untitled Document
Advertisements