మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:54 PM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన,  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ప్రస్తుతమున్న మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని తొలగించి, రాష్ట్రపతి పాలన విధించాలని విక్రమ్ గెహ్లాట్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటువంటి పిటిషన్లను స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యన్‌ల ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. రాజ్యాంగబద్ధంగా, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగట్లేదని విక్రమ్ తన పిల్‌లో ఆరోపించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం, కంగనా రనౌత్‌ కార్యాలయం కూల్చివేతలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలహీనంగా ఉన్నాయని వివరించాడు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని ఎలా చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. మహారాష్ట్ర ఒక పెద్ద రాష్ట్రమని గుర్తుచేసింది. అయితే, ఇటువంటి అంశాలపై రాష్ట్రపతిని సంప్రదించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉంది.. కానీ సుప్రీంకోర్టు తలుపుతట్టరాదని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం, నటి కంగనా మధ్య మాటల యుద్దం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల కిందట ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని గుండా ప్రభుత్వం అని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు సోనియా ఆర్మీ కూడా బాబర్ ఆర్మీతో కలిసి తప్పుగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ‘గౌరవ గవర్నర్ గుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆనందంగా ఉందన్నారు. గూండాలు బార్‌లు, రెస్టారెంట్లు తెరిచారు, కానీ దేవాలయాలను మూసివేశారు. సోనియా ఆర్మీ, బాబర్ సైన్యాన్ని మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు.

ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూసివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే మధ్య లేఖలు యుద్ధం సాగిన విషయం తెలిసిందే. గవర్నర్ రాసిన లేఖపై పెను దుమారమే రేగింది. ఉద్దవ్‌ను సెక్యులరిస్ట్‌గా మారిపోయారంటూ గవర్నర్ లేఖ రాయగా.. ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. లాక్‌డౌన్ పూర్తిగా పెట్టడం సరైనది కాదు, అదే విధంగా దానిని పూర్తిగా తొలగించడం సరైనది కాదు. ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం కూడా మంచి విషయం కాదు. నేను హిందుత్వాన్ని అనుసరిస్తున్నాను, నా హిందుత్వానికి మీ నుంచి సర్టిఫికెట్ అవసరం లేదు" అని అన్నారు.

Untitled Document
Advertisements