IPL 2020 : ప్లేఆఫ్స్‌ బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 05:32 PM

IPL 2020 : ప్లేఆఫ్స్‌ బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ

ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌కు చేరే జట్లేవి..? ఇప్పటి వరకూ జట్ల ఆటతీరు, సాధించిన విజయాల ఆధారంగా.. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. ముంబై, బెంగళూరు 12 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం మిగతా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో ఈ రేసులో ముందుంది. ప్లేఆఫ్స్‌కు చేరడం కోసం ఏ జట్టు ఏమేం చేయాలో చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్:
ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై పది మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లోనే గెలుపొంది, ఏడింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ధోనీసేన ప్లేఆఫ్స్ చేరడం కష్టంతో కూడుకున్న పనే. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరొచ్చు. కానీ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. పోటీ నుంచి వైదొలిగినట్టే. ఇతర జట్ల గెలుపోటములు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్రభావితం చేస్తాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
పంజాబ్‌ది కూడా చెన్నై పరిస్థితే. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ల్లోనూ ఓడిన పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో మూడింట్లోనే గెలిచింది. పంజాబ్‌కు కూడా ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. పంజాబ్ ఈజీగా ప్లేఆఫ్స్ చేరొచ్చు. కానీ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్స్ చేరడం కష్టంగా మారుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. కాకపోతే మిగతా ఐదు జట్లతో పోలిస్తే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఆరెంజ్ ఆర్మీ పంజాబ్, రాజస్థాన్‌తో తలపడనుంది. ఐదుకు ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం ఈజీ. నాలుగింట్లో గెలిస్తే మాత్రం నెట్ రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్:
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా రాజస్థాన్ సన్‌రైజర్స్ కంటే మెరుగైన స్థితికి చేరుకుంది. 10 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలుపొందిన రాజస్థాన్.. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్, పంజాబ్‌లపై గెలిస్తే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడింట్లో గెలిస్తే.. స్మిత్ సేన ప్లేఆఫ్స్ చేరొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్:
నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా కోల్‌కతాకు ఉన్నాయి. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లోనే గెలిస్తే రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements