ఎంఎస్ ధోనీపై సీరియస్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 05:36 PM

ఎంఎస్ ధోనీపై సీరియస్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా లాంటి ఆటగాళ్లను తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లలో మెరుపు (స్పార్క్) కనిపించనందునే.. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు యువ ఆటగాళ్లు బాగా రాణిస్తారని మహీ చెప్పుకొచ్చాడు. ధోనీ వ్యాఖ్యల పట్ల శ్రీకాంత్ మండిపడ్డారు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్‌తో మాట్లాడిన శ్రీకాంత్.. ‘‘ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాసెస్‌ను నమ్ముతానని ధోనీ చెబుతున్న మాటలను నేను అంగీకరించను. ధోనీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ టీమ్ సెలక్షన్ విధానమే తప్పు’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

కేదార్ జాదవ్, పియూష్ చావ్లాలకు తుది జట్టులో చోటు ఇవ్వడాన్ని 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యుడైన శ్రీకాంత్ తప్పుబట్టారు. కేదార్ జాదవ్ ఈ ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 62 పరుగులు చేశాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల జగదీషన్‌కు అవకాశం ఇస్తే 28 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మరి అలాంటప్పుడు యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని ధోనీ ఎలా చెబుతాడని శ్రీకాంత్ ప్రశ్నించారు.

‘‘జగదీషన్ లాంటి యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని నువ్వు చెబుతున్నావ్. మరి కేదార్ జాదవ్‌లో స్పార్క్ ఉందా..? పియూష్ చావ్లాలో స్పార్క్ చూపించాడా..? ధోనీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ధోనీ ఇవాళ మాట్లాడినదాన్ని నేను అంగీకరించను. ఇలా చేసే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి తలెత్తింది అని శ్రీకాంత్ వాపోయారు.


‘‘ఇక నుంచి జగదీషన్ లాంటి యువ ఆటగాళ్లకు చెన్నై అవకాశాలు ఇస్తుందేమో. కర్ణ్ శర్మ పరుగులు ఎక్కువగా ఇచ్చినా వికెట్లు తీస్తున్నాడు. కానీ చావ్లాను జట్టులోకి తీసుకుంటే ప్రయోజనమేం లేకపోయింది. ధోనీ గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి అనుమానాల్లేవ్. కానీ బంతి గ్రిప్ దొరకడం లేదన్న ధోనీ వ్యాఖ్యలను నేను సమర్థించను’’ అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements