ఆసియా-పసిఫిక్‌‌లో శక్తివంతమైన దేశంగా అమెరికా, మరి భారత్?

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:01 PM

ఆసియా-పసిఫిక్‌‌లో శక్తివంతమైన దేశంగా అమెరికా, మరి భారత్?

కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవడంలో విఫలమైన అమెరికా ప్రతిష్ఠ మసక బారినట్టు ఓ అధ్యయనం పేర్కొంది. దీని కారణంగా ఆసియా-పసిఫిక్‌ను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికాకు చైనా మరింత చేరువయ్యిందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శక్తివంతమైన దేశంగా అమెరికా తన స్థానాన్ని నిలుపుకోగా, రెండేళ్ల కిందటితో పోల్చితే చైనా 10 పాయింట్ల ఆధిక్యం సగానికి తగ్గిందని సిడ్నీకి చెందిన లోవి ఇన్‌స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ 2020 పేరుతో నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. మొత్తం 26 దేశాలు, ఇతర భూభాగాలకు ర్యాంకులను కేటాయించిందది. కరోనా మహమ్మారి, వివిధ వాణిజ్య వివాదాలు, పలు ఒప్పందాల నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలగడం వంటి చర్యలతో అమెరికా ప్రతిష్ఠ దిగజారిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లోవి ఇన్‌స్టిట్యూట్ చీఫ్, ఆసియా పవర్ అండ్ డిప్లొమసీ ప్రోగ్రాం డైరెక్టర్ హెర్వ్ లెమాహ్యూ వ్యాఖ్యానించారు. మహమ్మారి గేమ్ ఛేంజర్‌గా మారిందని అన్నారు. ‘ఇది అమెరికాలో ద్విముఖ సమస్యలకు దోహదం చేసింది, ఎందుకంటే ఒక వైపు, కోవిడ్ -19 సంక్షోభాన్ని సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రతిష్ఠ మసకబారగా.. మరోవైపు, మహమ్మారి వల్ల ఆర్థిక పతనం నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ 2024 వరకు కోలుకోవడం కష్టమని అన్నారు.

దీనికి విరుద్ధంగా, చైనా ఆర్ధికవ్యవస్థ వైరస్ నుంచి పుంజుకుంది.. ఈ ఏడాది ప్రపంచంలో కోలుకునే ఏకైక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇదే కాగా.. రాబోయే దశాబ్దంలో పొరుగు దేశాలకు వ్యతిరేకంగా అనేక ప్రయోజనాలు కలగజేస్తుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి ప్రపంచానికి చెప్పకుండా గుంభనంగా వ్యవహరించిందని ఆరోపణలను ఎదుర్కొన్నా చైనా దౌత్య సంబంధాలు చెప్పుకోదగ్గ రీతిలో దిగజారలేదని, ఈ అధ్యయనంలో వరుసగా మూడో ఏడాది రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. నవంబర్‌లో ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం వల్ల “అదే విధమైన” పోకడలు వస్తాయని అన్నారు. అయితే, అమెరికా స్థానాన్ని భర్తీ చేయడం, ఆసియా-పసిఫిక్ అనియంత్రిత ఆధిపత్య శక్తిగా మారడం చైనాకు కష్టసాధ్యమైందనే అభిప్రాయపడ్డారు. ‘చైనా చివరికి అమెరికాను సమం చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.. ఈ దశాబ్దం చివరినాటికి యూఎస్‌‌ను కూడా అధిగమించవచ్చు. కానీ గణనీయమైన వృద్ధితో ముందుకు సాగడానికి ప్రస్తుతం వేగం సరిపోదు’అని లెమాహ్యూ అన్నారు.

ఇక, ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మన కంటే ముందు జపాన్ మూడో స్థానంలో ఉంది. మహమ్మారి కారణంగా ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని కోల్పోయిందని, 2030 నాటికి చైనా ఆర్థిక ఉత్పత్తిలో 40 శాతానికి భారత్ చేరుకుంటుంది. గతేడాది ఇది 50 శాతంగా అంచనా వేశారు. ‘ఈ ప్రాంతంలోని గొప్ప శక్తిగా భారత్ అవతరించడానికి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘దక్షిణ ఆసియాలో కొత్తగా పెరుగుతున్న పేదలు, పేదరికం రేటు భారత్ అభివృద్ధికి సవాల్‌గా మారుతుంది’ అని లెమహ్యూ వ్యాఖ్యానించారు.

మహమ్మారి కారణంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 347.4 మిలియన్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉంటారని ఐక్యరాజ్యసమితి యూనివర్శిటీ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ రిసెర్చ్ తెలిపింది. మొత్తంమీద, ఆసియా ఆర్థిక వ్యవస్థ.. 2020లో మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కంటే పెద్దదిగా రూపుదిద్దుకుంది.. మహమ్మారి కారణంగా ప్రజారోగ్యం, ఆర్థిక, వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు లోవి నివేదిక తెలిపింది.





Untitled Document
Advertisements