తెలంగాణలో అప్పటి వరకు పరీక్షలు వాయిదా

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:13 PM

తెలంగాణలో అప్పటి వరకు పరీక్షలు వాయిదా

ప్రస్తుతం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. గత కొన్నిరోజులు కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పాటు, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు కొన్ని రోజులు వాయిదా వేయాలని వినతులు వచ్చాయి. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కేటీఆర్‌ సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. దీంతో దసరా పండగ వరకూ అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి సబితారెడ్డి మంగళవారం ట్వీట్‌ చేశారు. మరోవైపు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మీర్‌పేట చెరువు కట్టకు గండిపడిందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. చెరువు కట్ట తెగిందన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. చెరువు కట్టకు నీరు లీక్ అయ్యే ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసినట్లు మంత్రి తెలిపారు.






Untitled Document
Advertisements