ధోనీపై CSK ఫ్యాన్స్ ఫైర్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:09 PM

ధోనీపై  CSK ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సాంకేతికంగా నిష్క్రమించడాన్ని ఆ టీమ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ చెన్నై ఆడిన ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్‌‌కి చేరగా.. తాజా సీజన్‌ ఆ ప్లేఆఫ్ జైత్రయాత్రకి బ్రేక్ పడింది. దాంతో.. చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరాశని వ్యక్తం చేస్తూ.. కెప్టెన్ ధోనీతో పాటు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌నీ ఉతికారేస్తున్నారు. డ్యాడీస్ ఆర్మీలో అసమర్థులు పెరిగిపోయారని మండిపడుతున్న అభిమానులు.. వచ్చే ఏడాదికి రవీంద్ర జడేజా, శామ్ కరన్ మినహా ఎవరినీ రిటైన్ చేసుకోవద్దంటూ ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. ఐపీఎల్ తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ మూడింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా లీగ్ దశ సగం మ్యాచ్‌లు ముగిసే సమయానికి పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమవడం ఇదే తొలిసారి. చెన్నై తుది జట్టు ఎంపికపై తొలి మ్యాచ్‌ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఏమాత్రం ఫామ్‌లో లేని కేదార్ జాదవ్‌ని జట్టుతో కొనసాగించడం.. మధ్యలో జగదీషన్, మురళీ విజయ‌తో ప్రయోగాలు.. ఓపెనింగ్ జోడీలో మార్పులు.. అంబటి రాయుడి, డ్వేన్ బ్రావో‌కి గాయాలు.. సురేశ్ రైనా, హర్భజన్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ దూరమవడం.. ఇలా చెన్నై టీమ్‌ని వరుస సమస్యలు చుట్టుముట్టాయి. దానికి తోడు టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో విఫలమవుతుండటం ఆ జట్టుపై ఎక్కువ ప్రభావం చూపింది. చెప్పుకోవడానికి టీమ్‌లో లెక్కకి మించి సీనియర్లు ఉన్నా.. అరంగేట్రం ఆటగాడి తరహాలో వారు వికెట్లు చేజార్చుకోవడం కనిపించింది. దాంతో.. ఈసారి సీనియర్లకి ఉద్వాసన పలకాలని అభిమానులు సూచిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌ని కెప్టెన్‌గా ధోనీ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ జట్టు ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేర్చిన ధోనీ.. మూడు సార్లు టైటిల్‌ విజేతగానూ నిలిపాడు. కానీ.. మునుపటితో పోలిస్తే ధోనీలో ఆ దూకుడు లోపించింది. బ్యాటింగ్‌లో వరుసగా ఫెయిలవడం కూడా ధోనీ నెమ్మదించడానికి ఒక కారణం కావొచ్చు.





Untitled Document
Advertisements