హైదరాబాద్ వరదలు: ప్రకటన విడుదల చేసిన చంద్రబాబు

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:17 PM

హైదరాబాద్ వరదలు: ప్రకటన విడుదల చేసిన చంద్రబాబు

హైదరాబాద్ ప్రజలను భారీ వర్షాలు పీడిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత వరద నగరంలో బీభత్సం రేపుతోంది. కొన్ని చెరువులు పొంగి పొర్లగా, అనేక కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి. కాలనీ రోడ్లన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. కొంత మంది తమ ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలన్నీ తడిసిపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్‌లో బీభత్సం రేపుతున్న వరదలకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం పెద్ద మనసుతో స్పందిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.15 కోట్ల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రూ.2 కోట్లు ప్రకటించారు. హైదరాబాద్ వరదల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో వరదల విపత్తు ముగిసే వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ‘మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి’ అని చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ట్వీట్ చేశారు. వరదల వేళ టీడీపీ నాయకులు, శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.






Untitled Document
Advertisements