చెన్నై ఇప్పటికి ప్లేఆఫ్స్ కి చేరొచ్చు ఇలా?

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 08:54 PM

చెన్నై ఇప్పటికి ప్లేఆఫ్స్ కి చేరొచ్చు ఇలా?

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ముంబై నాలుగుసార్లు కప్ గెలిచినా.. మూడుసార్లు కప్ గెలిచిన ధోనీ సేన ప్రతిసారి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరింది. 2019 వరకు పది సీజన్లు ఆడితే.. ఐదుసార్లు రన్నరప్‌గానూ నిలిచింది. నిలకడకు మారుపేరు చెన్నై అని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సీజన్లో చెన్నైకి ఏదీ కలిసి రావడం లేదు. అనవసర తప్పిదాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇప్పటి వరకూ పది మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఎప్పుడూ టాప్‌లో ఉండే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇలా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ధోనీ నాయకత్వంలోని యెల్లో ఆర్మీ ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. నమ్మడమే కాదు.. ఎలా ప్లేఆఫ్స్ చేరగలదో కూడా కాగితం మీద రాసి చూపిస్తున్నారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్లేఆఫ్స్ చేరడానికి టెక్నికల్‌గా దారులు మూసుకుపోలేదు. ఇకపై ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లోనూ ధోనీ సేన విజయం సాధించి.. ప్రత్యర్థి జట్లు.. ముఖ్యంగా ఇప్పటి వరకూ టాప్-3కి దిగువన ఉన్న జట్లు కీలక మ్యాచ్‌ల్లో ఓడాలి.

ఢిల్లీ, ముంబై మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలవడంతోపాటు.. ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. కోల్‌కతా ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో ఓడి.. రాజస్థాన్ మరో రెండు మ్యాచ్‌లు, సన్‌రైజర్స్ మరో మ్యాచ్, పంజాబ్ మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. చెన్నై రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుందని ఫ్యాన్స్ లెక్కలేసి చెబుతున్నారు. అప్పుడు ఢిల్లీ ఖాతాలో 22 పాయింట్లు, ముంబై ఖాతాలో 20, ఆర్సీబీ ఖాతాలో 16, చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయంటున్నారు. నిజంగానే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరితే ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. ఐపీఎల్ మొత్తానికి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు.Untitled Document
Advertisements