బ్యాక్ విజయాల్ని అందుకున్న పంజాబ్, ఢిల్లీపై అలవోక విజయం

     Written by : smtv Desk | Wed, Oct 21, 2020, 10:40 AM

బ్యాక్ విజయాల్ని అందుకున్న పంజాబ్, ఢిల్లీపై అలవోక విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ టీమ్ 167/5తో ఛేదించేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12x4, 3x6) సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. ఛేదనలో నికోలస్ పూరన్ (53: 28 బంతుల్లో 6x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌కి క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3x4, 2x6), గ్లెన్ మాక్స్‌వెల్ (32: 24 బంతుల్లో 3x4) హిట్టింగ్ తోడవడంతో పంజాబ్ టీమ్ 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో పదో మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌కి ఇది నాలుగో విజయం‌కాగా.. ఢిల్లీకి ఇది మూడో ఓటమి. ఛేదనలో పంజాబ్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (15: 11 బంతుల్లో 1x4, 1x6) ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఔటవగా.. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3x4, 2x6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నికోలస్ పూరన్‌తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5 9 బంతుల్లో) రనౌటయ్యాడు. దాంతో.. 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 56/3‌తో పంజాబ్ నిలిచింది. కానీ.. ఈ దశలో మాక్స్‌వెల్‌తో కలిసి దూకుడుగా ఆడిన నికోలస్ పూరన్ ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూరన్.. జట్టు స్కోరు 125 వద్ద ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వచ్చేయగా.. ఆ తర్వాత మాక్స్‌వెల్ జోరందుకున్నాడు. చివర్లో దీపక్ హుడా (15: 22 బంతుల్లో 1x4), జేమ్స్ నీషమ్ (10 నాటౌట్: 8 బంతుల్లో 1x6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు, అక్షర్ పటేల్, అశ్విన్‌కి చెరొక వికెట్ దక్కింది. మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. పృథ్వీ షా (7: 11 బంతుల్లో 1x4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్.. మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే ఔటైపోగా.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14: 12 బంతుల్లో 1x6), రిషబ్ పంత్ (14: 20 బంతుల్లో 1x4), స్టాయినిస్ (9: 10 బంతుల్లో) కూడా నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన శిఖర్ ధావన్.. ఐపీఎల్‌ కెరీర్‌లో రెండో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఒకవేళ ధావన్‌తో పాటు టాప్ ఆర్డర్‌లో ఎవరైనా దూకుడుగా ఆడింటే..? ఢిల్లీ మరింత మెరుగైన స్కోరు సాధించి ఉండేది. ఆఖర్లో సిమ్రాన్ హిట్‌మెయర్ (10 నాటౌట్: 6 బంతుల్లో 1x6) ఒక సిక్స్‌తోనే సరిపెట్టాడు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు, మాక్స్‌వెల్, జేమ్స్ నీషమ్, మురగన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.





Untitled Document
Advertisements