ఆత్మహత్య చేసుకున్నా వదలని లోన్ యాప్స్...మృతుడి భార్యకూ ఫోన్ చేసి...!

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 12:07 PM

ఆత్మహత్య చేసుకున్నా వదలని లోన్ యాప్స్...మృతుడి భార్యకూ ఫోన్ చేసి...!

పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది సూత్రధారులను అరెస్ట్ చేసినా ఆన్‌లైన్ లోన్ ప్రతినిధుల వేధింపులు ఆగడం లేదు. రుణ యాప్‌‌ల ఒత్తిడి తట్టుకోలేక శనివారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన గుజ్జ చంద్రమోహన్‌(36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు భర్త చనిపోయిన విషాదంలో ఉన్న అతడి భార్య సుమలతనూ ఆన్‌లోన్ ప్రతినిధులు వదల్లేదు. ఆదివారం ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా తిడుతూ వేధింపులకు పాల్పడిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. చంద్రమోహన్ బంధువులకు కూడా ప్రతినిధులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. దీంతో సుమలతతో పాటు వారి బంధువులు ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై చంద్రమోహన్ భార్య సుమలత మాట్లాడుతూ.... ‘నా భర్తను, నన్ను, బంధువులను యాప్ లోన్ ప్రతినిధులు తీవ్రంగా వేధించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారి సూచనలతో బ్యాంక్ అకౌంట్లను వాడటం మానేశాం. అప్పటికే వారు మా డేటాను హ్యాక్ చేశారు. నా ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపేవారు. మా బంధువులకు సైతం ఫోన్లు చేసి వేధిస్తున్నారు. శనివారం నా భర్త చనిపోయిన విషాదంలో ఉంటే ఫోన్ చేసి అసభ్యంగా తిట్టారు. ఓ యాప్‌లో నా భర్త రూ.6వేల రుణం తీసుకుంటే రూ.50వేలు కట్టాల్సి వచ్చింది. ఇలా అన్ని యాప్‌లకు కలిపి రూ.6లక్షల వరకు కట్టాం’

అయినా కూడా కాల్‌ లిస్టులో ఉన్న అందరికీ నా భర్త ఫ్రాడ్ అంటూ మెసేజ్‌లు పంపించారు. బంధువులు, స్నేహితుల ముందు పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆయన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ లోన్ యాప్‌ల కారణంగా నేను, నా ముగ్గురు కూతుళ్లు రోడ్డున పడ్డాం’ అని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసుకు సంబంధించిన పేట్ బషీరాబాద్ సీఐ రమేష్ మాట్లాడుతూ.. ‘చంద్రమోహన్ 11 యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించాం. మొదట రూ. 6వేలు తీసుకోగా.. తర్వాత అది రూ.లక్షల్లోకి చేరింది. వాటిని తిరిగి కట్టలేని స్థితికి చేరుకోవడంతో లోన్ యాప్ ప్రతినిధులు అతడిని తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులకు చంద్రమోహన్ ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు కూడా చేశాడు. రాచకొండ పోలీసులు అతడికి ధైర్యం చెప్పి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని సూచించారు. అయినప్పటికీ అతడు మనోవేదనతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చంద్రమోహన్‌ని వేధించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారెవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. యాప్ లోన్ ప్రతినిధులకు ఎవరూ భయపడొద్దు’ అని చెప్పారు.

చంద్రమోహన్‌పై వేధింపులకు పాల్పడిన కేసులో.. పాన్ బ్యాన్, క్యాష్ మ్యాప్, రెడ్ కార్ప్, రూపీ ప్లస్, కుష్ క్యాష్, ఫిక్స్ క్యాష్, రూపీ ఇన్‌స్టంట్, మనీ మోర్, హోమ్ క్రెడిట్, క్యాష్ గో, క్యాష్ సీడ్ తదితర యాప్‌లపై ఐపీసీ 384, 420, 306, సెక్షన్ 67, ఐటీ యాక్ట్-2000 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రమోహన్‌ ఎన్ని యాప్‌ల నుంచి ఎంతెంత రుణం తీసుకున్నాడు? తిరిగి ఎంత చెల్లించాడు? అన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు.





Untitled Document
Advertisements