ఫుల్ కెపాసిటీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 05:17 PM

ఫుల్ కెపాసిటీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలోని సినిమా థియేటర్లను 100 శాతం కెపాసిటీతో నడుపుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సోమవారం అనుమతులు జారీ చేసింది. సంక్రాంతి (పొంగల్) సందర్భంగా కొత్త సినిమాల విడుదల ఉండటంతో థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని 100 శాతానికి పెంచాలని హీరోలు విజయ్, శింబు సహా పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టార్ హీరో విజయ్ స్వయంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలిసి ప్రస్తుత 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలను ఎత్తివేయాలని కోరారు. విజయ్ తాజా చిత్రం ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ ఈ సంక్రాంతికి విడుదలవుతున్నాయి.



సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సీటింగ్ కెపాసిటీని పూర్తిగా పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 కేసులు తగ్గుతుండటంతో సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో సీటింగ్ కెపాసిటినీ పెంచాలనే థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని 0 నుంచి 100 శాతానికి పెంచిన ప్రభుత్వం.. మిగిలిన నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే, ప్రేక్షకుల్లో కొవిడ్-19 పట్ల అవగాహనను పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సినిమా మధ్యలో ప్రదర్శించాలని ఆదేశించింది.

కాగా, తమిళనాడులో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు నవంబర్ 10 నుంచి తెరుచుకున్నాయి. కేంద్ర హోం శాఖ నిబంధనలకు అనుగుణంగా అప్పుడు 50 శాతం సీటింగ్ కెపాసిటీకి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ పరిశ్రమకు చెందినవారు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కానీ, పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.. విమర్శిస్తున్నారు.

తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై నటి రాధికా శరత్‌కుమార్ ట్విట్టర్ ద్వారా పాజిటివ్‌గా స్పందించారు. ‘‘థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి తమిళనాడు అనుమతి ఇవ్వడం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. సీఎం ఎడప్పాడి పళనిస్వామికి, మంత్రి కదంబూర్ రాజుకు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమ మళ్లీ తిరిగి తన కాళ్ల మీద నిలబడబోతుండటం ఆనందంగా ఉంది’’ అని విజయ్, శింబులను ట్యాగ్ చేస్తూ రాధిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే నిర్మాత ఎస్.ఆర్. ప్రభు కూడా ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.




అయితే, తమిళనాడు బీజేపీ అధికారిక ప్రతినిధి ఎస్జీ సూర్య మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘‘తమిళనాడులో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకుంటాయని తెలిసి షాక్‌కు గురయ్యాను. వ్యాక్సిన్ కోసం గడిచిన 10 నెలలు మనం వేచి చూశాం. మరి కొన్ని నెలలు వేచి చూడటం పెద్ద సమస్య కాదు. నేను కొవిడ్‌తో బాధపడ్డాను. అది ఎంత ప్రమాదమో నాకు తెలుసు. 50 శాతం ఆక్యుపెన్సీ అంటే పర్వాలేదు అనుకోవచ్చు. కొన్ని వేల, లక్షల మంది ప్రజల జీవితాలను పణంగా పెట్టడం సరికాదు’’ అని ట్విట్టర్‌లో సూర్య పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సుమంత్ రామన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.





Untitled Document
Advertisements