గంగూలీ‌కి నో సర్జరీ

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 06:38 PM

గంగూలీ‌కి నో సర్జరీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రి సోమవారం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. కోల్‌కతాలోని తన ఇంటిలో శనివారం ఉదయం వ్యాయామం చేస్తుండగా.. గంగూలీ ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దాంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడ్ని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాని పరిశీలించిన వైద్యులు.. స్వల్ప గుండెపోటు వచ్చినట్లు తేల్చి.. వెంటనే యాంజియో‌ప్లాస్టీ నిర్వహించారు.

దాదా గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు తేలగా.. స్టెంట్ వేశారు. చికిత్స తర్వాత గంగూలీ యాక్టీవ్‌గా ఉన్నట్లు బులిటెన్ ద్వారా పేర్కొన్న ఆసుపత్రి.. మరో యాంజియోప్లాస్టీ చేయాలని తొలుత భావించింది. ఈ మేరకు 9 మందితో కూడిన మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయగా.. ఈరోజు మీటింగ్‌లో చర్చించిన బోర్డు సభ్యులు సౌరవ్ గంగూలీకి బైపాస్ సర్జరీ అవసరం లేదని తేల్చింది.

సౌరవ్ గంగూలీ ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉండటంతో.. అతనికి వెంటనే మరో యాంజియోప్లాస్టీ నిర్వహించడం అవసరం లేదని మెడికల్ బోర్డులోని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత అతని ఆరోగ్యాన్ని సమీక్షించిన తర్వాత యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోవాలని మీటింగ్‌ని బోర్డు ముగించింది. యాంజియోప్లాస్టీ వాయిదా పడటంతో సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.





Untitled Document
Advertisements