జనవరి 8న మరోసారి రైతు సంఘాలతో భేటీ

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 07:49 PM

జనవరి 8న మరోసారి రైతు సంఘాలతో భేటీ

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి రాలేదు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతులు తగ్గట్లేదు.. కేంద్రం దిగిరావట్లేదు. దీంతో చర్చల్లో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. జనవరి 8న మరోసారి సమావేశమై తదుపరి చర్చలు కొనసాగించాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం (జనవరి 4) ఏడో విడత చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టాయి. దీంతో పాటు కనీస మద్దతు ధర కల్పించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపాయి. సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.

చట్టాలను వెనక్కి తీసుకునే దాకా వెనక్కి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తెలిపారు. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే ఇతర అంశంపైనా తాము చర్చలకు సిద్ధంగా లేమన్నారు. ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఆందోళనల నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్గతంగా చర్చించి రావాలని రైతు సంఘాలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.





Untitled Document
Advertisements