మయాంక్ తప్పిదాలకు కారణం అదే!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:02 PM

మయాంక్ తప్పిదాలకు కారణం అదే!

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఆరంభంలోనే పేలవ షాట్ సెలక్షన్‌తో వికెట్ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్‌పై మూడో టెస్టులో వేటు వేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తుండగా.. స్టాన్స్ మార్చుకుంటే అతని ఆట మెరుగుపడుతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచిస్తున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ 17 పరుగుల వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 40 బంతులాడి 9 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో అదీ మొదటి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా డకౌటైన మయాంక్ అగర్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొత్తంగా.. ఈ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అతని షాట్ సెలక్షన్‌తో పాటు ఫుట్ వర్క్ మెరుగ్గా లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ వైఫల్యాల గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ‘‘మయాంక్ అగర్వాల్ తీసుకునే స్టాన్స్ కారణంగా అతనికి బ్యాలెన్స్ దొరకడం లేదు. కాళ్లని ఎడంగా ఉంచి అతను స్టాన్స్ తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై.. అదీ బౌలర్లకి అదనపు బౌన్స్ లభిస్తున్న సమయంలో.. బ్యాట్స్‌మెన్ బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి ఆడాలి. కానీ.. మయాంక్ అగర్వాల్ తీసుకుంటున్న స్టాన్స్ కారణంగా.. అతనికి ఆ ఛాన్స్ లభించడం లేదు. దాంతో.. మయాంక్ ఎక్కువగా ఫ్రంట్‌ ఫుట్‌కి వెళ్లి ఆడే ప్రయత్నం చేస్తూ.. వికెట్ చేజార్చుకుంటున్నాడు’’ అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. మూడో టెస్టుకి మయాంక్ అగర్వార్‌పై వేటు వేసి రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌ని ఓపెనర్లుగా ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements