ఆన్‌లైన్ యాప్‌ల ఫ్రాడ్ కేసు...కీలక సూత్రధారి కీర్తి అరెస్ట్

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:13 PM

ఆన్‌లైన్ యాప్‌ల ఫ్రాడ్ కేసు...కీలక సూత్రధారి కీర్తి అరెస్ట్

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తూ అధిక వడ్డీల పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న కంపెనీలతో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీల వెనుక చైనా హస్తం ఉందని నిర్ధారించిన పోలీసులు ఆ దేశానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే యాన్‌ యు అనే కొత్త కంపెనీని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో గుర్తించారు. ఐటీ కంపెనీలున్న కోరమంగళ సమీపంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న ఈ కంపెనీ నిర్వాహకురాలు కీర్తి(31)ని సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆ కాల్‌ సెంటర్‌లో 14 యాప్‌ల ద్వారా కోట్ల రూపాయల రుణాలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ కంపెనీ యజమాని అయిన చైనా జాతీయుడు వాంగ్‌ జియాన్‌ షి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని రుణాల యాప్‌ కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ పోలీసులకు చిక్కిన ఈశ్వర్‌ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు యాన్‌ యు కంపెనీపై ఫోకస్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తన కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేసింది. సోమవారం తెల్లవారుజామున కాల్‌సెంటర్‌ తెరిచి సామగ్రిని తరలిస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

బిహార్‌లోని కతిహార్‌ జిల్లాకు చెందిన కీర్తి ఎంబీఏ పూర్తిచేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. చిన్న కంపెనీలు, ఐటీ సంస్థల్లో పనిచేసి గతేడాది సెప్టెంబరులో యాన్‌ యు కంపెనీ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంది. వాంగ్‌ జియాన్‌ షి ఆమెను హెచ్‌ఆర్ మేనేజర్‌గా నియమించి టెలీకాలర్స్ ద్వారా రుణాలు వసూలు చేయాలని ఆదేశించాడు. గతేడాది జూన్‌లో వాంగ్‌ జియాన్‌ షి చైనా వెళ్లిపోవడంతో అన్ని వ్యవహారాలు ఆమే చూసుకుంటోంది.





Untitled Document
Advertisements