‘‘చెల్లెమ్మా నా మాట విను"...జాగ్రత్తలు చెప్పిన జూ.ఎన్టీఆర్

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:16 PM

‘‘చెల్లెమ్మా నా మాట విను

ఇటీవల కాలంలో చాలామంది అమ్మాయిలు ఫేస్ బుక్ ప్రేమలో పడి జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ఫేస్ బుక్ , ఆన్ లైన్ చాటింగ్‌ పేరుతో అనేకమంది అమాయక అమ్మాయిల జీవితాలతో కొందరు దుర్మార్గులు ఆటలాడుకున్నారు. అయితే అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు ప్రముఖ హీరో ఎన్టీఆర్. ఫేస్‌బుక్ ప్రేమల బారినపడి మోసపోవద్దంటూ ఎన్టీఆర్ అవగాహన కల్పిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ మోసాలకు పాల్పడే ముఠాలు చాలానే ఉన్నాయని, వాటి బారినపడొద్దంటూ తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు. పోలీసులు రూపొందించిన వీడియోలో అమ్మాయిలు ఎలా ఫేస్ బుక్ ప్రేమలో పడి మోసపోతున్నారో చూపించారు. అపరిచత వ్యక్తులతో చాటింగ్ చేసి తమ వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఈ వీడియో పక్కాగా చూపించారు. ఇలాంటి కొన్ని ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని.. ఆపై ప్రేమ పేరుతో వల విసురుతాయని పోలీసులు ఆ వీడియోలో చూపించారు. కాస్తంత దగ్గరైన తర్వాత వాట్సాప్‌లో అభ్యంతరకర ఫొటోలను తెప్పించుకుంటాయని, అలా వారిని నమ్మి మన పర్సనల్ ఫోటోల్ని షేర్ చేస్తే.. ఆ తర్వాత మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారని వీడియోలో ఓ అమ్మాయి ఫేస్ చేసిన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు పోలీసులు. ఇలాంటివి నమ్మితే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ‘‘చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మోసగాళ్ల బారినపడి ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. ఎన్టీఆర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.









Untitled Document
Advertisements