జైల్లో గడిపిన నిర్దోషికి ప్రభుత్వ ఉద్యోగం...సీఎం హామీ

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:15 PM

జైల్లో గడిపిన నిర్దోషికి ప్రభుత్వ ఉద్యోగం...సీఎం హామీ

అత్యాచారం, హత్య కేసులో ఓ పరిశోధక విద్యార్ధి అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. ఎనిమిదేళ్ల జైల్లోనే మగ్గిపోయిన అతడు ఎట్టకేలకు నిర్దోషిగా బయటకు వచ్చిన ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడి కలలు చెదిరిపోయాయి. ఏ తప్పూ చేయకపోయినా జైలు శిక్ష అనుభవించిన అతడి విషయంలో మణిపూర్ సీఎం మానవతాదృక్పథంతో వ్యవహరించారు. పరిశోధక విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. ‘అమాయకుడైన పరిశోధక విద్యార్థి తౌడమ్ జిబల్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు... ప్రజలు అతని ఇంటిని దహనం చేశారు.. అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం’ అని ప్రకటించారు.

హత్యాచారం కేసులో తౌడమ్ జిబిల్ సింగ్‌ను సెషన్స్ కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను కలిసి తనకు సాయం చేయాలని కోరాడు. రిమ్స్ పాథాలజీ విభాగానికి చెందిన జూనియర్ రిసెర్చ్ ఫెలోపై అత్యాచారం, హత్య కేసులో జిబల్ సింగ్‌ను సజీవా సెంట్రల్ జైలులో నిర్బంధించారు. జిబల్ సింగ్‌కు ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటు అతడికి అటవీశాఖలో ఉద్యోగం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చారు. జబల్ సింగ్ తండ్రి కూడా అటవీశాఖలో గార్డుగా పనిచేశారు. అసలు దోషులకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంఫాల్ రిమ్స్ పాథాలజీ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో అయిన యువతి 2013 ఏప్రిల్ 5న కాల్వలో శవంగా తేలింది. ఇంటి నుంచి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆమె హత్యకు గురయ్యింది. శరీరంపై బలమైన గాయాలు గుర్తులు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదుచేశారు. పోస్ట్‌మార్టంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్టు నిర్ధారణ అయ్యింది.

అయితే, అసలు దోషులను వదిలేసి, జిబల్ సింగ్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రధాని నిందితులు క్షేత్రిమయమ్, తోజియమ్ థెస్చ్‌లపై ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యింది. ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఆలస్యం కావడంతో జిబల్ సింగ్ ఎనిమిదేళ్లు జైళ్లోనే ఉండిపోయారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయపోరాటం ఫలించడంతో అసలు దోషులు ఎవరో బయటపడింది.





Untitled Document
Advertisements