చైనాకు చెందిన మరికొన్ని యాప్‌లపై ట్రంప్ నిషేధం

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:08 PM

చైనాకు చెందిన మరికొన్ని యాప్‌లపై ట్రంప్ నిషేధం

మరో పది రోజుల్లో అధికార పీఠం నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పోతూ పోతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చివరి రోజుల్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా, చైనాకు చెందిన మరికొన్ని యాప్‌లపై నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. చైనా వ్యాపార దిగ్గజం జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని అలీపే.. టెన్సెంట్‌ గ్రూప్‌నకు చెందిన వీచాట్‌పే సహా మొత్తం ఎనిమిది యాప్‌ల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుండగా.. అప్పటికి అధ్యక్ష బాధ్యతలను బైడెన్ చేపట్టనున్నారు.
ఈ యాప్‌లు నిబంధనలను ఉల్లంఘించి, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. దీని వల్ల కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించి చైనా ప్రభుత్వం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ధ్వజమెత్తారు. ఈ కారణంతోనే చైనా యాప్‌లపై నిషేధం విధించామని స్పష్టం చేశారు.

వీచాట్‌ పే, క్యూక్యూ వ్యాలెట్‌, టెన్సెంట్‌ క్యూక్యూ యాప్‌లపైనా ట్రంప్ నిషేధం విధించారు. గతంలోనూ వీచాట్‌పేను నిషేధించగా.. యాపిల్‌, ఫోర్డ్‌ మోటార్‌, వాల్‌మార్ట్‌, వాల్ట్‌ డిస్నీ వంటి అమెరికా దిగ్గజ సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. చైనాలో వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు ఎంతో కీలకమని వాదించాయి. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో సవాల్ చేశాయి. దీంతో ట్రంప్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.

సోషల్ మీడియా దిగ్గజ యాప్ టిక్‌టాక్‌పై కూడా ట్రంప్ నిషేధం విధించినా.. ఆ ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. న్యాయపరమైన కారణాలతో ఈ నిషేధాన్ని కొన్నాళ్లు నిలిపేస్తున్నట్లు అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్ గత నవంబరులో ప్రకటించింది. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్‌ చైనాకు చేరవేస్తోందని ట్రంప్‌తో పాటు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పదేపదే ఆరోపించారు. కానీ వాటికి ఎలాంటి ఆధారం చూపలేదు. టిక్‌టాక్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.





Untitled Document
Advertisements