యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 03:05 PM

యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

ఒక యువతి కడుపులోఏకంగా రెండున్నర కిలోలకు పైగా వెంట్రుకలు బయటపడ్డాయి. మీరు నమ్మలేకపోయిన ఇది నిజం. కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్స చేశారు...కడుపులో నుండి ఆ వెంట్రుకల కుచ్చును బయటకు తీశారు. ఈ అత్యంత అరుదైన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ యువతి (22) కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ యువతికి మానసికంగా ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల తన ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులకు చెప్పలేకపోయింది.

దీంతో ఇంటి వ్యక్తులు సైతం ఆమెది సాధారణ సమస్యేనని భావించేవారు. అయితే... ఓ పదిహేను రోజులుగా... ఆ యువతి ఏం తిన్నా, తాగినా వాంతులవుతుండటం వల్ల స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉంచారు. స్కానింగ్ తీసి పరిక్షించారు. ఎలాంటి రోగ లక్షణాలు గుర్తించకపోవటం వల్ల ఇంటికి పంపించారు. మళ్లీ ఇంటికి వచ్చాక పరిస్థితి ఎప్పటిలా మారింది.రోజురోజుకీ ఆరోగ్యం క్షిణిస్తుండటాన్ని చూసి... పట్టణంలోని ప్రశాంత్ జీకే అసుపత్రికి యువతిని తరలించారు. బాధిత యువతి తల్లిదండ్రులతో మాట్లాడిన అక్కడి వైద్యుడు యువతి రోజువారీ అలవాట్లు, అనారోగ్య లక్షణాలను అడిగి తెలుసుకున్నారు.

అనుమానంతో ఆమెకు ఎండోస్కోపి నిర్వహించగా.... అసలు విషయం బయటపడింది. ఆ బాధితురాలి చిన్నపేగులో వెంట్రుకలున్నట్లుగా గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించగా... తల్లిదండ్రులు అంగీకరించారు.
కడుపులోని చిన్న ప్రేగులో పోగైన వెంట్రుకల ముద్దను... గ్యాస్టరస్టమి విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి బయటకు తీశారు. ఇలా బయటపడ్డ వెంట్రుకలు దాదాపు 150 సెం.మీ పొడవుతో, రెండున్నర కిలోలకు పైగా బరువున్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం బాధితురాలి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒక మనిషి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు బయటపడటం అత్యంత అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా మానసిక స్థితి సరిగా లేని వారిలో వెంట్రుకలు తినే అలవాటుంటుందని... అయితే ఇంత మొత్తం పోగవడమనేది చాలా అరుదని వైద్యులు వివరించారు.మహిళ‌‌‌ కడుపు నుండి వెంట్రుకలు తీసి ప్రాణాలు కాపాడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యం చేసిన డాక్టర్లకు కృతజ్ఙతలు తెలిపారు.





Untitled Document
Advertisements