బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 03:15 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై గొర్రెల సుబ్రమణ్యం నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

కాగా, ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మంగళవారం జరిగింది. నేచురల్ స్టార్ నాని, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, సప్తగిరి, ఎడిటర్ తమ్మిరాజు, సమర్పకుడు రమేష్ కుమార్ గంజి, బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వినాయక్, నాని ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘నా కెరీయర్ ఆరంభంలో బెల్లంకొండ సురేష్ గారితో ‘రైడ్’ సినిమా చేశాను. ఆ చిత్రం ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలుసు. అప్పుడు సాయిని చూశాను.. ఆఫీసులో డాన్సులు, ఫైట్స్ ప్రాక్టీసు చేసేవాడు. ‘అల్లుడు శీను’తో సాలిడ్‌గా కెరీర్ ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తున్నాడు. త్వరలో హిందీలో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను థియేటర్‌కి తీసుకుని రావడంలో ‘అల్లుడు అదుర్స్’ కీ రోల్ పోషించాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకు ఎక్కువ డబ్బులు రావాలి’’ అని అన్నారు.

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ‘‘సాయిని ‘అల్లుడు శీను’తో లాంచ్ చేశాం. ఆ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ ఎంత బాగా చేశాడో ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’లో కూడా సాయి అద్భుతంగా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ సాంగ్స్ ఇచ్చాడు. రాజమండ్రి నుండి సినిమా మీద ప్యాష‌న్‌తో వచ్చిన నా మిత్రుడు సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రమేష్ కుమార్ కూడా మంచి ఫ్రెండ్ . వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి పనిచేసిన అందరికీ మంచి పేరు, నిర్మాతలకు మరిన్ని డబ్బులు రావాలి. మా సాయికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ ఈ ప్రాజెక్టుని ఇంత బాగా డిజైన్ చేసిన బెల్లంకొండ సురేష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ‘రాక్షసుడు’ సినిమాకి ముందు సాయితో సినిమా చేసుకో అని మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకొని గొప్పగా సినిమా చేసి ఇచ్చారు. నేను ఊహించిన దాని కంటే ‘అల్లుడు అదుర్స్’ అద్భుతంగా వచ్చింది. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, ఎంటర్‌టైన్మెంట్ సూపర్‌గా చేశారు. సాయికి కూడా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. సంతోష్ శ్రీనివాస్ ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా నన్ను నిర్మాతగా ఇండస్ట్రీలో పరిచయం చేస్తున్నారు. చోటా కె. నాయుడు గారు ఫెంటాస్టిక్ విజువల్స్‌తో అద్దంలా సినిమాని తీర్చిదిద్దారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మంచి సాంగ్స్‌తో పాటు, ఆర్.ఆర్ కూడా చాలా బాగా చేశారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో వస్తోన్న ఈ చిత్రం ఆడియెన్స్ చేత ‘అల్లుడు అదుర్స్’ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండక్కి వస్తున్న పర్ఫెక్ట్ యాప్ట్ ఫిల్మ్ ఇది. కంటెంట్ నమ్మి కాంప్రమైజ్ కాకుండా సుబ్రమణ్యం చాలా గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మూడు కమర్షియల్ సాంగ్స్, రెండు మెలోడీస్ సూపర్బ్‌గా ఇచ్చారు. ఈ సినిమా చూశాక ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ మా ‘అల్లుడు అదుర్స్’ అంటారు’’ అని వెల్లడించారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘‘హీరో, హీరోయిన్స్‌తో పాటు మా యూనిట్ అంతా కశ్మీర్‌లో ఉన్నారు. అక్కడ లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నా మొదటి సినిమా ‘సాంబయ్య’ నుండి ఇప్పటివరకూ నిర్మాతగా నన్ను అందరూ సపోర్ట్ చేసి.. ఎంకరేజ్ చేశారు. మా అబ్బాయి సాయిని కూడా ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నిర్మించిన సుబ్రమణ్యం, రమేష్ కుమార్‌లను కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.

‘కందిరీగ’తో వాసుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ‘రభస’ చేశాను.. రెవెన్యూ పరంగా ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. ‘హైపర్’ కూడా బాగానే ఆడింది. ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ టాప్ టెన్ డైరెక్టర్స్ లిస్టులో చేరతాడు. ఇక నుండి ‘కందిరీగ’ వాసు అనేది పోయి ‘అల్లుడు’ వాసు అని పిలుస్తారు. అంత గొప్పగా ఈ సినిమాని తెరకెక్కించిన వాసుకి హాట్సాప్. కచ్చితంగా వాసుకి ఈ సినిమా మంచిపేరు తెస్తుంది.

సుబ్రమణ్యం సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా డేరింగ్ ఉన్న ప్రొడ్యూసర్. ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని చాలా భారీగా నిర్మించిన ఆయన గట్స్‌కి హ్యాట్సాప్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎక్కువ ధరకి అడిగినా కూడా సినిమా మీద నమ్మకంతో ఈస్ట్ వెస్ట్‌లలో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయన గోల్డెన్ నిర్మాతగా పేరు తెచ్చుకుంటాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్ నా సొంత బ్యానర్ లాంటిది. ప్రతి సంవత్సరం మా అబ్బాయితో ఈ బ్యానర్లో సినిమా ఒకటి చేస్తాం’’ అని అన్నారు.





Untitled Document
Advertisements