ఆదాయంలో బీసీసీఐ టాప్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 04:11 PM

ఆదాయంలో బీసీసీఐ టాప్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయంలో తనకి తిరుగులేదని మరోసారి నిరూపించింది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌‌ని విడుదల చేసింది. అందులో బోర్డు నికర విలువ రూ. 14,489.80 కోట్లుగా ఉన్నట్టు బీసీసీఐ పేర్కొనగా.. 2014-15లో ఆ విలువ కేవలం 5,438.61 కోట్లు మాత్రమే. అంటే.. ఈ నాలుగేళ్లలోనే బీసీసీఐ ఆదాయం ఎవరూ ఊహించని రేంజ్‌లో పెరిగిపోయింది.
ఏటా ఐపీఎల్‌ నుంచి రూ. వేల కోట్ల ఆదాయం గడిస్తున్న బీసీసీఐ.. దేశవాళీ టోర్నీలు నిర్వహించడం ద్వారా కూడా కూడా రూ. వందల కోట్లని వెనకేసుకుంటోంది. ఎంతలా అంటే..? 2018లో బీసీసీఐ ఆదాయం రూ. 4,017.11 కోట్లుకాగా.. ఇందులో కేవలం ఐపీఎల్ ద్వారా వచ్చిన ఆదాయమే రూ. 2,407.46 కోట్లు కావడం గమనార్హం. అలానే భారత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు ద్వారా బీసీసీఐకి రూ.446 కోట్లు వచ్చినట్లు ఆ బ్యాలెన్స్ షీట్‌లో బీసీసీఐ పేర్కొంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్‌ షీట్‌ని ఇంకా బీసీసీఐ సిద్ధం చేయలేదు.

క్రికెట్ ప్రపంచాన్ని ఇప్పటికే శాసించే స్థితికి చేరుకున్న బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఢీ అంటే ఢీ అనేందుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. బీసీసీఐని ఎదురించి ఐసీసీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయడం లేదు. బీసీసీఐ తన ఆదాయంలో నుంచి ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, అఫ్గానిస్థాన్ క్రికెట్‌కి రూ. వందల కోట్లలో సాయం చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ ప్రపంచంలో మరే బోర్డుకీ ఈ రేంజ్‌లో ఆదాయం లేదని గణాంకాలు చెప్తున్నాయి.





Untitled Document
Advertisements