బ్రాహ్మణ యువతులకు బంపరాఫర్...వారిని పెళ్లి చేసుకుంటే రూ.3 లక్షలు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 06:18 PM

బ్రాహ్మణ యువతులకు బంపరాఫర్...వారిని పెళ్లి చేసుకుంటే రూ.3 లక్షలు

బ్రాహ్మణ యువతులకు కర్ణాటక ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకుంటే రూ.3 లక్షల నగదు బహుమతి అందిస్తామని తెలిపింది. సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ‘మైత్రేయి’ పథకం కింద 3 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని బ్రాహ్మణ బోర్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు పథకాలను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

‘అరుంధతి’ పథకం కింద బ్రాహ్మణ వధువులకు రూ.25 వేలు ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ‘మైత్రేయి’ పథకం ప్రకటించింది. ఆలయాల్లో అర్చకులుగా పనిచేసే బ్రాహ్మణ యువకులను వివాహం చేసుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే.. దీన్ని తొలుత బాండ్ రూపంలో ఇస్తామని, 3 సంవత్సరాల తర్వాత ఈ బాండ్‌ను నగదు రూపంలో మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు.

మైత్రేయి పథకం కింద లబ్ధి పొందడానికి వధువు కచ్చితంగా బ్రాహ్మణ వర్గానికి చెంది యువతే అయుండాలని.. అంతేకాకుండా ఆమె చేసుకునే వివాహం మొదటిదై ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. పేద బ్రాహ్మణ యువతులను వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చే అర్చకులకు రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు తెలిపారు.

అర్చకత్వం, పౌరోహిత్యం చేస్తున్న బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. బ్రాహ్మణ వర్గానికి చెందిన యువకులతో పాటు యువతులను ప్రోత్సహించేందుకు గాను ఈ నగదు ప్రోత్సాహం అందజేస్తున్నామని కర్ణాటక బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు ఛైర్మన్ ఎస్‌హెచ్ సచ్చిదానంద తెలిపారు.

ఎకరా లోపు పొలం ఉన్న వారికి బోరుబావి తవ్వడానికి, ట్రాక్టర్ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామని సచ్చిదానంద ప్రకటించారు. అయితే.. ఈ పథకాలకు కొన్ని షరతులు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఇది సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజల కోసమేనని స్పష్టంచేశారు.





Untitled Document
Advertisements